Kolkata doctor rape and murder: హత్యాచారానికి ముందు కోల్ కతా డాక్టర్ తన డైరీలో ఏం రాసిందో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Kolkata rape-murder victim diary: కోల్ కతాలో అత్యంత పాశవికంగా హత్యాచారానికి గురైన మహిళా డాక్టర్ చివరి రోజు తన డైరీలో ఏమని రాసుకుందో ఆమె తండ్రి మీడియాకు తెలిపారు. కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ కు బయలుదేరే ముందు ఆమె ఆ డైరీ రాసింది. ఆ డైరీలో ఆమె ఏం రాసిందో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Kolkata rape-murder victim diary: కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్ ను పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డాక్టర్లు రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఆ డాక్టర్ సామూహిక అత్యాచారానికి గురైందని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
కోల్ కతా ట్రైనీ డాక్టర్ తండ్రి ఆవేదన
తాను పనిచేసే ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి తన కుమార్తె తన చివరి రోజు డైరీలో ఏం రాసిందో వెల్లడించాడు. తన కూతురికి చదువంటే చాలా ఇష్టమని, అన్నిట్లో టాప్ ర్యాంక్ రావాలని కోరుకునేదని, తను జీవితంలో బాగా సెటిల్ కావడం కోసం కుటుంబం అంతా ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. ‘‘డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె చాలా పోరాడింది. కలలను సాకారం చేసుకోవడం కోసం తను ప్రతిరోజూ 10-12 గంటలు చదువుకునేది’’ అని ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు తమ జీవితం ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్యూటీకి వెళ్లే ముందు డైరీలో ఏం రాశారు..
ఆ ట్రైనీ డాక్టర్ కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధులకు బయల్దేరే ముందు ఎప్పట్లాగే డైరీ రాసుకుంది. తన జీవిత లక్ష్యాలను అందులో మరోసారి గుర్తు చేసుకుంది. జీవితంలో తాను ఏం సాధించాలనుకుందో వెల్లడించింది. ప్రస్తుతం ఎండీ చదువుతున్న ఆ డాక్టర్.. పరీక్షల్లో టాపర్ గా నిలిచి ఎండీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించాలన్నది తన లక్ష్యమని ఆ డైరీలో రాసుకుంది. వైద్య వృత్తి పట్ల తనకున్న అంకితభావం ఆమె డైరీలో కనిపిస్తుందని చెబుతూ ఆమె తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.
దోషులకు శిక్ష పడాలి..
తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అయితే, కూతరును కోల్పోయిన తమకు, ఆ శూన్యతను ఏదీ భర్తీ చేయలేదని, అయితే దోషికి శిక్ష పడితే కొంత ఊరట లభిస్తుందని అన్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తమకు మొదట సమాచారం ఇచ్చారని చెప్పారు.
ఆ రాత్రి ఏం జరిగింది..
తన సహచర డాక్టర్లతో కలిసి రాత్రి భోజనం చేసిన తర్వాత ఆసుపత్రిలోని సెమినార్ హాల్ లో ఆ ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఒంటరిగా ఉన్న విషయం గుర్తించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆమె నోరు, కళ్లు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయిందని, ఆమె ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం జననేంద్రియ హింసను సూచిస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
గొంతు నులిమి హత్య చేశారా?
అత్యాచారం చేసిన తరువాత ఆ డాక్టర్ ను గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె గొంతు మృదులాస్థి విరిగిపోయిందని, ఆమె శరీరంపై అనేక ఇతర గాయాలు కూడా కనిపించాయని పోస్టుమార్టం నివేదికలో ఉంది. ఈ దారుణానికి పాల్పడిన ఓ మున్సిపల్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది.