Kolkata Rape Murder : వైద్యురాలిపై అత్యాచారం కేసు.. హింసాత్మకంగా మారిన 'రీక్లెయిమ్ ది నైట్'
Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా రీక్లెయిమ్ ది నైట్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొంతమంది వ్యక్తులు RG కర్ ఆసుపత్రి, పోలీసులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కోల్‌కతాలో అర్ధరాత్రిపూట చాలా మంది మహిళలు నిరసన తెలిపారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్యకు సంబంధించి రోజురోజుకు నిరసనలు అధికం అవుతున్నాయి. ఇప్పటికే వైద్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మహిళలు కూడా అర్ధరాత్రి కోల్‌కతాలో నిరసన వ్యక్తం చేశారు. అయితే బుధవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయిన రీక్లెయిమ్ ది నైట్ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆసుపత్రిపై దాడి
గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆసుపత్రిలోని కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. ఇప్పటికే సీబీఐ ఈ కేసుపై విచారణ మెుదలుపెట్టింది. అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన మధ్యలో అర్ధరాత్రి 12.40 గంటలకు RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు.
రీక్లెయిమ్ ది నైట్
సోషల్ మీడియా ద్వారా ఊపందుకున్న 'రీక్లెయిమ్ ది నైట్' ప్రచారం ద్వారా నిరసనలు రాత్రి 11.55 గంటలకు ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలోని అనేక అనేక ప్రాంతాల్లో వ్యాపించాయి. అయితే కొందరు వ్యక్తులు ఆసుపత్రిపై దాడి చేయడంతో నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, హింసకు సోషల్ మీడియా పోస్ట్‌లు, పుకార్లే కారణమని నేరుగా ఆరోపించారు.
పోలీసులపై దాడి
పోలీసుల ప్రకారం దాదాపు 40 మంది వ్యక్తుల బృందం, నిరసనకారుల వేషధారణలో, ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించారు. ఆస్తులను ధ్వంసం చేసి, పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ తాను సీపీతో మాట్లాడానని చెప్పారు. ఆస్తులను ధ్వంసం చేసినవారి రాజకీయ సంబంధాలతో పని లేకుండా 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టీఎంసీపై ప్రతిపక్షాల ఆరోపణలు
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. మమతా బెనర్జీ పంపిన టీఎంసీ గూండాలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. 'మమతా బెనర్జీ తన TMC గూండాలను RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర ర్యాలీకి పంపారు. నిరసనకారులుగా కనిపించి, గుంపుతో కలిసిపోయి, RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల విధ్వంసానికి పాల్పడ్డారు.' అని సువేందు అన్నారు.
నిరసన ప్రదర్శనలు
అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని వేలాది మంది మహిళలు బుధవారం అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో మెుదలైన 'రీక్లెయిమ్ ది నైట్' నిరసనల్లో భాగంగా పాల్గొన్నారు. అర్ధరాత్రి వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతో నిండిపోయింది. న్యూ టౌన్‌లోని బిస్వా బంగ్లా గేట్ వద్ద దాదాపు 8,000 మంది కొవ్వొత్తులను పట్టుకుని ప్రదర్శన చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ గత వారం డ్యూటీలో ఉండగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ నేరానికి సంబంధించి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.