Jagtial Crime : కుటుంబంలో చిచ్చు పెట్టిన దుబాయ్ డబ్బు, ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య!
Jagtial Crime : దుబాయ్ డబ్బు కుటుంబంలో చిచ్చు పెట్టింది. భర్త తనకు కాకుండా అత్తకు డబ్బు పంపుతున్నాడని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ముగ్గురు పిల్లల తల్లి బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది.
Jagtial Crime : గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్లిన భర్త డబ్బులు అత్తకు పంపుతున్నాడన్న కోపంలో కోరుట్లలో కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు పిల్లలను తల్లి లేని వారిని చేసింది. బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన భర్త పంపించే డబ్బులు ఆ ఇంట్లో చిచ్చు పెట్టినట్లైంది. భార్యను కాదని భర్త తల్లికి డబ్బులు పంపించడాన్ని తప్పుగా భావించింది కోడలు. క్షణికావేశంతో ముగ్గురు పిల్లల తల్లి బలవన్మరణానికి పాల్పడడం కలకలం సృష్టిస్తుంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ ప్రాంతానికి చెందిన పులివేని సృజన ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది. మేనత్త శశికళ కొడుకు సురేష్ తో సృజన వివాహం ఏడేళ్ల క్రితం అయింది. వారికి ఆరేళ్ల లోపు ఇద్దరు కొడుకులు, 8 నెలల పసిపాప ఉన్నారు. కుటుంబ పోషణ, బతుకు దెరువు కోసం సురేష్ పదేళ్లుగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నాడు. పాప పుట్టాక ఆరు మాసాల క్రితమే కోరుట్లకు వచ్చి మళ్లీ గల్ఫ్ వెళ్లాడు. ప్రతిసారి మాదిరిగానే సురేష్ గల్ఫ్ నుంచి డబ్బులు పంపిస్తూ తల్లిపై కాస్త ఎక్కువ ప్రేమ చూపాడు. అది నచ్చని సృజన ఆత్మహత్యకు పాల్పడింది.
కొడుకులను బడికి పంపించి... పసిపాపను పక్కింట్లో పడుకోబెట్టి
అత్త శశికళ బిడ్డ వద్దకని ఊరికి వెళ్లగా సృజన తన ఇద్దరు కొడుకులను స్కూల్ కు పంపించింది. పసి పాపను పక్కింట్లో పడుకోబెట్టి ఇంటికొచ్చి భర్తకు వీడియో కాల్ చేసింది. ఏం మాట్లాడిందో ఏం జరిగిందో తెలియదు కానీ క్షణాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది వరకు ఓసారి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో అలానే బెదిరిస్తుందని అనుకున్నారట. కానీ ఈసారి నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
క్షణికావేశంతో నిర్ణయం
కోడలు సృజన ఆత్మహత్యకు ప్రధాన కారణం భర్త తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమేనట. అంతా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్నా.. భర్త దుబాయ్ నుంచి డబ్బులు తల్లికి పంపించడం, తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతోనే సృజన ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఏం సమస్య లేదంటున్నారు. అత్త కోడలు ఒక్కింట్లో పుట్టిన వారేనని, మేనకోడలు ఇలా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటున్నారు కుటుంబ సభ్యులు. అత్తాకోడలు అక్క చెల్లెళ్ల మాదిరిగా కలిసి ఉంటారని స్థానికులు తెలిపారు. కానీ భర్త పంపించే డబ్బుల విషయంలో క్షణికావేశానికి గురై సృజన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అంటున్నారు.
సృజన ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. క్షణికావేశంతో సృజన తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు పిల్లలు తల్లిలేనివారై బిక్కుబిక్కుమంటూ చూడడం చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది. కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. కానీ క్షణికావేశానికి గురి కాకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుంటే సక్సెస్ అవుతాం. లేకుంటే ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు పోలీసులు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం