Crime news: కోర్టు హాళ్లో జడ్జీతో లాయర్ గొడవ; న్యాయవాదులపై పోలీసుల లాఠీ చార్జ్-clash breaks out between police lawyers at ghaziabad court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: కోర్టు హాళ్లో జడ్జీతో లాయర్ గొడవ; న్యాయవాదులపై పోలీసుల లాఠీ చార్జ్

Crime news: కోర్టు హాళ్లో జడ్జీతో లాయర్ గొడవ; న్యాయవాదులపై పోలీసుల లాఠీ చార్జ్

Sudarshan V HT Telugu
Oct 29, 2024 03:52 PM IST

Crime news: ఘజియాబాద్ కోర్టులో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యాయవాదులను కోర్టు ఆవరణ నుంచి తరలించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కోర్టు హాళ్లో జడ్జీకి, లాయర్ కు మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ గొడవ చెలరేగింది.

న్యాయవాదుల నిరసన
న్యాయవాదుల నిరసన (X-@aviralsingh15)

Crime news: ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఒక లాయరుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఒక న్యాయవాది, న్యాయమూర్తి మధ్య ప్రారంభమైన వాగ్వాదం చివరకు తీవ్రస్థాయి ఘర్షణగా మారింది. ఆ కేసు బార్ అసోసియేషన్ సభ్యుడికి సంబంధించినది కావడంతో కోర్టు హాళ్లోకి భారీగా న్యాయవాదులు వచ్చారు. ఘర్షణ పెరగడంతో కోర్టు హాళ్లో న్యాయవాదులు విధ్వంసం సృష్టించారు. అక్కడి కుర్చీలను విసిరి, విరగ్గొట్టారు. ఉద్రిక్తతలు పెరగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వచ్చి లాఠీఛార్జ్ చేశారు. దాంతో, పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి.

లాయర్లపై లాఠీ చార్జ్

పోలీసులకు, న్యాయవాదులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. లాయర్లను కోర్టు ఆవరణ నుంచి తరలించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో కోర్టు హాలులో కుర్చీలు కూడా విసిరారు. జిల్లా జడ్జితో వాగ్వాదం జరగడంతో పెద్ద ఎత్తున న్యాయవాదులు జడ్జి చాంబర్ చుట్టూ గుమిగూడారు. దీంతో న్యాయమూర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయవాదులను పంపించేయడం ప్రారంభించారు. పోలీసుల లాఠీచార్జితో ఆగ్రహించిన న్యాయవాదులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు కోర్టు ఆవరణలోని పోలీసు ఔట్ పోస్టును ధ్వంసం చేశారు. న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

న్యాయమూర్తుల నిరసన

మరోవైపు, ఈ ఘటన తర్వాత ఆ కోర్టులోని న్యాయమూర్తులంతా విధులను నిలిపివేసి, నిరసన తెలిపారు. కాగా, 2023 జూలైలో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ లో రెండు వర్గాల న్యాయవాదుల మధ్య ఘర్షణ గందరగోళానికి దారితీసింది. కొందరు న్యాయవాదులు నాటు తుపాకులను పోలిన వాటిని కాల్చడం, కనీసం ఐదారు రౌండ్లు కాల్పులు జరపడం వంటి వీడియోలు బయటకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై రక్షణ కోసం పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. న్యాయవాదులు కోర్టు ఆవరణలోకి తుపాకులు తీసుకురావడంతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయి.

Whats_app_banner