TG Group 1 Aspirants Protest : అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన - పోలిసుల లాఠీఛార్జ్‌-police charge baton against group 1 candidates in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Group 1 Aspirants Protest : అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన - పోలిసుల లాఠీఛార్జ్‌

TG Group 1 Aspirants Protest : అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన - పోలిసుల లాఠీఛార్జ్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 18, 2024 04:19 PM IST

జీవో 29 రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న గ్రూప్ 1 అభ్యర్థులపై పోలిసుల లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. ఇక జీవో 29ని సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీఛార్జ్
గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీఛార్జ్

తెలంగాణలోని గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే… మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ అశోక్ నగర్ లో జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల లాఠీఛార్జ్ పై గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టారని… తాము ఎలాంటి తప్పు చేయాలని, హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. జీవో 29ని రద్దు చేసి గతంలో ఉన్నట్టు జీవో 55 ప్రకారం… గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ ఆందోళనపై స్పందించి… తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

సుప్రీంను ఆశ్రయించిన అభ్యర్థులు…

గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై న్యాయవిదాలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ న్యాయవాది మోహిత్ రావు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారం చేపడతామని ప్రకటించింది.

మరోవైపు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి తెలంగాణలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 13ఏళ్లుగా తెలంగాణలో గ్రూప్‌ 1నియామకాలు జరగలేదు. 2023లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగినా పేపర్‌ లీక్ కావడంతో అవి రద్దు అయ్యాయి. ఆ తర్వాత పరీక్షల్ని రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు.

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా కొంత మంది అభ్యర్థులు అశోక్‌నగర్‌లో ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Whats_app_banner