ట్విట్టర్ సొంతమైతే.. ఎలాన్ మస్క్ చేసే మార్పులివే..!
అమెరికా: ట్విట్టర్.. ఎలాన్ మస్క్ సొంతం కానున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. మస్క్ ఆఫర్‌కు ట్విట్టర్ ఓకే చెబుతుందని సమాచారం. ఈ తరుణంలో.. ఒకవేళ నిజంగా ట్విట్టర్ మస్క్ సొంతమైతే.. సామాజిక మాధ్యమానికి ఆయన ఎలాంటి మార్పులు చేస్తారు? అన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Elon musk twitter buy | సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లనుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను ట్విట్టర్ అంగీకరిస్తుందని, ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన సైతం వెలువడనుందని సమాచారం. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటే.. ఎలాన్ మస్క్ ఎటువంటి మార్పులు చేస్తారు? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ విధానాలపై మస్క్ ఇటీవలి కాలంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మస్క్‌కు దాదాపు 83మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో తన ఖాతా నుంచి ట్విట్టర్‌పై కొన్ని పోల్స్ నిర్వహించారు.
వాటిని పరిగణలోకి తీసుకుని.. ట్విట్టర్‌కు మస్క్ చేసే మార్పులపై నిపుణులు, విశ్లేషకులు కొన్ని అంచనాలు వేస్తున్నారు. అవేంటంటే..
- Elon Musk twitter news | ఎడిట్ బటన్: ట్విట్టర్‌కు ఎడిట్ బటన్ ఉంటే ఎలా ఉంటుంది? అని మస్క్‌కు ఓ అలోచన వచ్చింది. ఇదే విషయంపై ఈ నెల 4న ట్విట్టర్లో ఓ పోల్ నిర్వహించారు. 4మిలియన్‌కుపైగా ఓట్లు దాఖలు కాగా.. మస్క్ ఆలోచనలకు చాలా మంది జై కొట్టారు.
- ట్విట్టర్ ఆల్గొరిథం: ట్విట్టర్ ఆల్గొరిథంకు మార్పులు చేసి దానిని ఓపెన్ సోర్స్‌గా మార్చాలని మస్క్ భావించారు. దీనిపైనా పోల్ నిర్వహించారు. 82.7శాతం మంది ఆయన ఆలోచనలకు అనుకూలంగా ఓట్లు వేశారు. చేసిన ట్వీట్‌ను ప్రమోట్ చేశారా? లేదా? అన్న విషయం యూజర్లకు తెలియాలని మస్క్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. గిట్‌హబ్‌లో ఆ కోడ్స్ పెడితే.. చూసిన వారు ఏవైనా మార్పులు సూచిస్తారని పేర్కొన్నారు.
- క్రిప్టోకరెన్సీ స్కామ్స్: 2020లో మస్క్ ఖాతా హైక్‌కు గురైంది. అప్పుడు ఆయన పేరుతో క్రిప్టో కరెన్సీ గురించి వార్తలు బయటకొచ్చారు. మస్క్ దానిని తీవ్రంగా పరిగణించారు. ఎక్కువ డబ్బులను ట్విట్టర్.. ఎన్ఎఫ్టీలు చూపించే ప్రొఫైల్ ఫొటోల మీద పెడుతోందని, కానీ క్రిప్టో స్కామర్లు.. స్పామ్బాట్లు ప్రయోగించి ప్రతి విషయంలోనూ బ్లాక్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
- భావప్రకటనా స్వేచ్ఛ: ట్విట్టర్ విధానాలపై మస్క్ ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా భావప్రకటనా స్వేచ్ఛకు ట్విట్టర్ భంగం కలిగిస్తోందని అనేకమార్లు ఆరోపించారు. ట్విట్టర్.. తన ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉందా? అని ఓ పోల్ నిర్వహించారు. 'లేదు' అని 70శాతానికపైగా మంది ఓట్లు వేశారు. అందువల్ల ఈ విషయంలో మార్పులను ఆశించవచ్చు.
ట్విట్టర్‌కు ఝలక్..
Elon Musk twitter | గత కొంతకాలంగా.. ట్విట్టర్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్. ట్విట్టర్లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్‌తో ట్విట్టర్ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్‌ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్‌కు షాక్ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌ను ముందుకు తీసుకొచ్చారు.
సంబంధిత కథనం