ఎలాన్​ మస్క్​తో ట్విట్టర్​ చర్చలు.. కంపెనీ అమ్మకానికి సిద్ధం..!-twitter begins talks with elon musk will they seal the deal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఎలాన్​ మస్క్​తో ట్విట్టర్​ చర్చలు.. కంపెనీ అమ్మకానికి సిద్ధం..!

ఎలాన్​ మస్క్​తో ట్విట్టర్​ చర్చలు.. కంపెనీ అమ్మకానికి సిద్ధం..!

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 03:33 PM IST

అమెరికా: ఎలాన్​ మస్క్ వ్యవహారంలో ట్విట్టర్​ దిగొచ్చింది! మస్క్​తో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. మస్క్​ మంచి ఆఫర్​ ఇస్తే.. ఆయనకు సంస్థను అమ్మేందుకు ట్విట్టర్​ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మస్క్​ చేతికి ట్విట్టర్​…!
మస్క్​ చేతికి ట్విట్టర్​…! (REUTERS)

Twitter Elon musk news | అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​, సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ట్విట్టర్​ను కొనేందుకు ఈ నెల మొదట్లో.. మస్క్​ భారీ ఆఫర్​ ఇచ్చిన విషయం తెలిసిందే. మస్క్​ను ఎదుర్కొనేందుకు ట్విట్టర్​ ప్రణాళికలు రచిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా.. ఇరువురి మధ్య అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎలాన్​ మస్క్​తో ట్విట్టర్​ ఆదివారం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది..!

ట్విట్టర్​ను కొనేందుకు 43బిలియన్​ డాలర్ల ఆఫర్​ ఇచ్చారు మస్క్​. ఇది.. ట్విట్టర్​ షేర్​హోల్డర్లను కుదిపేసింది. చాలా మంది ఈ ఆఫర్​కు అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ట్విట్టర్​ దిగొచ్చి.. మస్క్​తో చర్చలు మొదలుపెట్టినట్టు ఓ నివేదిక బయటకొచ్చింది.

అయితే.. మస్క్​ ఆఫర్​ను ట్విట్టర్​ పరిగణిస్తుందా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ మంచి ఆఫర్​ లభిస్తే.. ట్విట్టర్​ను మస్క్​కు అమ్మేందుకు సంస్థ ఆలోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు మీడియాకు చెప్పడం గమనార్హం.

ఎలాన్​ మస్క్​.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్​ షేర్​హోల్డర్లతో భేటీ అవుతున్నారు. తన ఆఫర్​ను అంగీకరించాలని, అది కంపెనీకే మంచిదని చెబుతున్నారు. దీనిపై సానుకూలంగా ఉన్న షేర్​హోల్డర్లు.. ఇంత మంచి డీల్​ను మిస్​ చేసుకోవద్దని.. ట్విట్టర్​పై ఒత్తిడి తెస్తున్నారు.

Elon Musk twitter | ఈ క్రమంలోనే మస్క్​ బృందంతో ట్విట్టర్​ చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇంకా మంచి డీల్​ ఏదైనా మస్క్​ నుంచి రాబట్టవచ్చా? అనే విషయంపై ట్విట్టర్​ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

భారత సంతతి వ్యక్తి పరాగ్​ అగర్వాల్​.. ఇటీవలే ట్విట్టర్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సామర్థ్యాలపై షేర్​హోల్డర్లకు నమ్మకం ఉన్నప్పటికీ.. పరాగ్​ నేతృత్వంలో కంపెనీ ఎదిగేందుకు సమయం పడుతుందని వారు భావిస్తున్నారు. అందుకే.. మస్క్​ ఆఫర్​తో లబ్ధిపొందేందుకు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు చూస్తున్నట్టు సమాచారం.

కానీ ట్విట్టర్​ మాత్రం.. ఈ డీల్​ తీసుకునే విషయంలో సందిగ్ధతలో పడినట్టు కనిపిస్తోంది. ఓవైపు మస్క్​తో చర్చలు జరుపుతూనే.. ఈ డీల్​ పూర్తికాకూడదని సంస్థ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. అందుకే.. ఎస్​ఈసీ(సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛైంజ్​ కమీషన్​).. మస్క్​ను అడ్డుకుంటే బాగుంటుందని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మస్క్​పై ఏవిధంగానైనా రెగ్యులేటర్లు దర్యాప్తు చేపడితే.. ట్విట్టర్​ కొనుగోలు కోసం ఆయన వెనకడుగు వేస్తారని ఆ సంస్థ ఆశిస్తోందని పేర్కొన్నాయి.

మస్క్​ చేతికి ట్విట్టర్​.!

Elon Musk twitter stake | గత కొంతకాలంగా.. ట్విట్టర్​పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్​. ట్విట్టర్​లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్​తో ట్విట్టర్​ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్​ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్​ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్​కు షాక్​ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్​ను ముందుకు తీసుకొచ్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్