ట్విట్టర్​లో 73.5మిలియన్​ షేర్లు కొన్న మస్క్​.. సంస్థపై పట్టుకోసమేనా?-tesla ceo elon musk takes 9 2 stake in twitter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్విట్టర్​లో 73.5మిలియన్​ షేర్లు కొన్న మస్క్​.. సంస్థపై పట్టుకోసమేనా?

ట్విట్టర్​లో 73.5మిలియన్​ షేర్లు కొన్న మస్క్​.. సంస్థపై పట్టుకోసమేనా?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2022 05:20 PM IST

శాన్ ఫ్రాన్సిస్కొ: ట్విట్టర్​లో మస్క్​.. 73.5 మిలియన్​ షేర్లను కొన్నారు. దీని విలువ 3బిలియన్​ డాలర్లని తెలుస్తోంది.

ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (AP)

Musk twitter stake | అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​లో 73.5మిలియన్​ షేర్లు కొనుగోలు చేశారు. దీని విలువ 3 బిలియన్​ డాలర్లని సమాచారం. ఫలితంగా ట్విట్టర్​లో మస్క్​ 9.2శాతం వాటా సంపాదించుకున్నారు.

ట్విట్టర్​లో మస్క్​ వాటాను పాసివ్​ ఇన్​వెస్ట్​మెంట్​గా పరిగణిస్తారు. అంటే సంస్థలో మస్క్​ను దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా లెక్కిస్తారు. షేర్లను ఆయన అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు.

ట్విట్టర్​ నిబంధనలపై ఇటీవలే మస్క్​ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో​.. అదే కంపెనీలో 9.2శాతం వాటా పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. భావప్రకటనా స్వేఛ్చకు ట్విట్టర్​ భంగం కలిగిస్తోందని మస్క్​ పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​కు ధీటుగా ఓ సోషల్​ మీడియా యాప్​ను సృష్టించే విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

"ఇది ఆరంభమే అని మేము అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇది పాసివ్​ ఇన్​వెస్ట్​మెంట్​ మాత్రమే. కానీ మస్క్​.. తన వాటాను గణనీయంగా పెంచుకుని.. సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. ట్విట్టర్​ ఓనర్​షిప్​ పాత్రకు అర్హత సాధించవచ్చు," అని వెడ్​బుష్​ సెక్యూరిటీస్​కు చెందిన డాన్​ ఇవీస్​ అభిప్రాయపడ్డారు.

మస్క్​ వాటా వార్తతో ట్విట్టర్​ షేర్లు.. మార్కెట్​ ఓపెనింగ్​కు ముందే 25శాతం పెరిగాయి. టెస్లా షేర్లు స్వల్పంగా పైకెళ్లాయి.

ఆ ట్వీట్​లో ఏముందంటే…

Elon Musk twitter | భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చి, వ్యక్తిగత ప్రయోజనాలు లేని, ఓపెన్​ సోర్స్​ ఆల్గొరిథంతో కూడిన సామాజిక మాధ్యమ వేదికను తీసుకొస్తారా? అని ఓ ట్విట్టర్​ వినియోగదారుడు  ఇటీవలే మస్క్​ను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే.. కొత్త సోషల్​ మీడియా యాప్​ను రూపొందించే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు మస్క్​.

ట్విట్టర్​లో మస్క్​ చాలా యాక్టివ్​గా ఉంటారు. కాగా గత కొంతకాలంగా.. ట్విట్టర్, సంస్థ​ విధానాలపై ఆయన విమర్శలు చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ విలువలను పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ట్విట్టర్​పై అనేకమార్లు మండిపడ్డారు.

ఇదే విషయంపై ఆయన ట్విట్టర్​లో ఓ పోల్​ కూడా నిర్వహించారు. 'ట్విట్టర్​.. ఫ్రీ స్పీచ్​కు విలువ ఇస్తుందా?' అని ఆయన ప్రశ్నించారు. 'ఈ పోల్​ అనంతర పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయి, జాగ్రత్తగా ఓట్లు వేయండి,' అని పేర్కొన్నారు. మస్క్​ అడిగి ప్రశ్నకు 70శాతం మంది యూజర్లు 'నో' అనే జవాబిచ్చారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే.. కొత్త సోషల్​ మీడియా వేదిక గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు మస్క్​ చెప్పడం గమనార్హం.

అనేకమంది ప్రముఖులు సొంతంగా తమ సోషల్​ మీడియా యాప్​లను తీసుకొస్తున్నారు. ఇటీవలే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 'ట్రూత్​' పేరుతో ఓ యాప్​ను విడుదల చేశారు. కాగా మస్క్​ నిజంగానే యాప్​ను తీసుకొస్తే.. ట్విట్టర్​, ఫేస్​బుక్​ వంటి దిగ్గజ సామాజిక మాధ్యమాలకు పోటీ తప్పదు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్