CBSE notice: 10, 12 తరగతుల ఫలితాలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన; ఇక ఆ ఫలితాలు వెల్లడించబోమని స్పష్టీకరణ-cbse not to award any division or distinction in class 10 and 12 board exams ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Notice: 10, 12 తరగతుల ఫలితాలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన; ఇక ఆ ఫలితాలు వెల్లడించబోమని స్పష్టీకరణ

CBSE notice: 10, 12 తరగతుల ఫలితాలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన; ఇక ఆ ఫలితాలు వెల్లడించబోమని స్పష్టీకరణ

HT Telugu Desk HT Telugu
Dec 01, 2023 04:17 PM IST

CBSE notice on class 10 and 12 board exams: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాల గురించి సీబీఎస్ఈ శుక్రవారం కీలక ప్రకటన వెలువరించింది. విద్యార్థుల మార్కుల శాతాన్ని వెల్లడించబోమని స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Representative Image)

CBSE notice on class 10 and 12 board exams: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాల గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం వివరణ ఇచ్చింది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ‘‘ఓవరాల్ డివిజన్/డిస్టింక్షన్/ఎగ్రిగేట్ మార్క్స్ ప్రకటించబోం’’ అని పేర్కొంది.

పత్రికా ప్రకటన

10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల మార్కుల శాతాన్ని గణించే పద్ధతిని వివరించాలని సీబీఎస్ఈ (CBSE) కి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో, ఈ వివరాలను సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యాం భరద్వాజ్ అధికారిక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘‘ఓవరాల్ డివిజన్ ను కానీ, విద్యార్థి సాధించిన డిస్టింక్షన్ ను కానీ, ఎగ్రిగేట్ మార్క్స్ శాతాన్ని కానీ సీబీఎస్ఈ ప్రకటించదు.(Board does not calculate/inform/declare the percentage of marks)’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యార్థి సాధించిన మార్కులను బోర్డు ప్రకటించబోదని వెల్లడించారు. ఉన్నత విద్య కోెసం ఆ వివరాలు అవసరమని భావిస్తే, ఆ విద్యార్థి చదివిన విద్యా సంస్థ ఆ మార్కులు, మార్కుల శాతం, డిస్టింక్షన్ తదితర వివరాలను అందిస్తుందని తెలిపింది. ఒకవేళ, ఒక విద్యార్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను రాసినట్లయితే, వాటిలో ఉత్తమమైన ఐదు సబ్జెక్టులను నిర్ణయించే నిర్ణయం ఆ విద్యార్థి చదివిన విద్యా సంస్థ తీసుకుంటుందని సీబీఎస్ఈ వివరించింది.

సీబీఎస్ఈ నిర్ణయంపై హర్షం

విద్యార్థుల మార్కులకు సంబంధించి డివిజన్లు, డిస్టింక్షన్లను ప్రకటించకూడదని సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం నూతన విద్యా విధానం (NEP) లో భాగంగా సీబీఎస్ఈ తీసుకుంది. ఈ నిర్ణయం విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడంతో పాటు, వారిని సమగ్ర విద్యా సముపార్జన దిశగా ప్రోత్సహిస్తుంది. పరీక్షలు, మార్కుల ఒత్తిడి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గణనీయమైనదని, సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులపై ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

మరోవైపు అనుమానాలు..

మరోవైపు, ఈ నిర్ణయం విద్యార్థుల్లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల్లో పోటీతత్వం దెబ్బతినడం, అధిక మార్కులు సాధించాలన్న స్ఫూర్తి కొరవడడం, మంచి ఫలితాలు సాధించి గుర్తింపు పొందే అవకాశం లేకపోవడంతో ఆసక్తి తగ్గిపోవడం.. వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.