Bengaluru horror: బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..-bengaluru horror womans body chopped into 30 pieces found stored in fridge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Horror: బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..

Bengaluru horror: బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..

Sudarshan V HT Telugu
Sep 21, 2024 09:43 PM IST

భారత దేశ ఐటీ రాజధానిగా పేర్కొనే బెంగళూరులో దారుణం జరిగింది. సుమారు 30 ముక్కలుగా నరికి, అపార్ట్ మెంట్ లోని ఫ్రిజ్ లో కుక్కిన ఒక 29 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఢిల్లీ శివార్లలో గతంలో జరిగిన శ్రద్ధా వాల్కర్ దారుణ హత్యను గుర్తు చేస్తోంది.

బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..
బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి.. (HT_PRINT)

29 ఏళ్ల మహిళ మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా కోసి రిఫ్రిజిరేటర్లో కుక్కిన దారుణం బెంగళూరులో బయటపడింది. ఈ ఘటన వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ రోజు ఉదయం ఆ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంట్లో 30 ముక్కలుగా నరికిన ఒక యువతి మృతదేహం ఫ్రిజ్ లో కనిపించింది.

మాల్ లో పని చేస్తూ..

బాధిత మహిళను మహాలక్ష్మి గా పోలీసులు గుర్తించారు. ఆమె బెంగళూరు (bengaluru) లో స్థానికంగా ఉండే మాల్ లో పని చేస్తోందని, భర్త నుంచి వేరుగా ఉంటోందని తెలుసుకున్నారు. ఈ హత్య జరిగి కనీసం 5 రోజులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. మహాలక్ష్మి అనే మహిళను వారం రోజుల క్రితం హత్య చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టి ఉంటారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ‘‘వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఓ మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో కుక్కి పెట్టారు. ఇది నాలుగైదు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది’’ అని వెస్ట్ జోన్ అదనపు పోలీసు కమిషనర్ ఎన్ .సతీష్ కుమార్ తెలిపారు.

భర్తకు సమాచారం

కర్ణాటక (karnataka) లో బెంగళూరుకు దూరంగా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్న బాధిత యువతి భర్త ఈ విషయం తెలుసుకుని తిరిగి వచ్చాడు. మృతదేహాన్ని గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాధితురాలు కర్ణాటకలో స్థిరపడినప్పటికీ వేరే రాష్ట్రానికి చెందిన యువతి అని వెల్లడించారు. ఘటన జరిగిన అపార్ట్మెంట్ ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేసి మృతదేహాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించామని తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీతో..

ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, బాధితురాలికి సన్నిహితంగా ఉండే ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామని నగర పోలీసులు తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నారు.

శ్రద్దా వాకర్ దారుణ హత్య ఉదంతం

మే 22న దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్దా వాకర్ (Shraddha Walker) దారుణ హత్యకు గురైన ఘటనను ఈ బెంగళూరు ఘటన గుర్తు చేస్తోంది. 28 ఏళ్ల వాల్కర్ ను ఆమె లివ్ ఇన్ పార్టనర్ అఫ్తాబ్ పూనావాలా మెహ్రౌలీలో గొంతు నులిమి హత్య చేశాడు. పూనావాలా ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి దాదాపు మూడు వారాల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచి, ఆమె శరీర భాగాలను నగరం అంతటా పడేశాడు. తరువాత ఢిల్లీ పోలీసులు పూనావాలా అద్దె ఫ్లాట్ నుండి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.