Refrigerator Explosion : ఉమెన్స్ హాస్టల్‌లో రిఫ్రిజిరేటర్ పేలి ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు-refrigerator explosion in madurai womens hostel two persons died ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Refrigerator Explosion : ఉమెన్స్ హాస్టల్‌లో రిఫ్రిజిరేటర్ పేలి ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

Refrigerator Explosion : ఉమెన్స్ హాస్టల్‌లో రిఫ్రిజిరేటర్ పేలి ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

Anand Sai HT Telugu
Sep 12, 2024 12:26 PM IST

Refrigerator Explosion In Madurai : తమిళనాడులోని మదురైలో దారుణం జరిగింది. ఉమెన్స్ హాస్టల్‌లో రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

మదురైలోని పెరియార్ బస్టాండ్ సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గురువారం తెల్లవారుజామున రిఫ్రిజిరేటర్ పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులను ప్రమీలా చౌదరి (50), శరణ్య (22)గా గుర్తించారు. విసాక ఉమెన్స్ హాస్టల్‌లో రిఫ్రిజిరేటర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

తెల్లవారుజామున 4.30 గంటలకు సుమారు 40 మంది మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దట్టమైన పొగ, భారీగా మంటలు చెలరేగడంతో హాస్టల్‌లోని యువతులు బయటకు పరుగులు తీశారు. పేలుడు సమయంలో రిఫ్రిజిరేటర్ దగ్గరగా నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరికి తీవ్ర గాయాలై ఊపిరి సరిగా ఆడలేదు. మరికొందరికి గాయాలు అయ్యాయి. మరికొందరు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు.

అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మిగిలిన మహిళలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. మృతి చెందిన మహిళల మృతదేహాలను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించగా, మరో ముగ్గురు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా సమయంలో 40 మంది వరకూ ఉన్నట్టుగా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

టాపిక్