Delhi Shraddha Walker Murder: శ్రద్ధా వాకర్ తల కోసం చెరువును ఖాళీ చేస్తున్న పోలీసులు
Delhi Shraddha Walker Murder: శ్రద్ధా వాకర్ తలను వెతికేందుకు మెహ్రౌలీలోని ఓ చెరువును ఖాళీ చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. నిందితుడు ఆఫ్తాబ్ చెప్పిన వివరాల మేరకు పోలీసులు గాలిస్తున్నారు.
Delhi Shraddha Walker Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విచారణను వేగవంతం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఆధారాలను సేకరిస్తున్నారు. శ్రద్ధను పీక నులిమి చంపిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీలోని మెహ్రౌలీ అడవిలో పారేసినట్టు చెప్పాడు. ఇప్పటికే కొన్ని శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. మరిన్నింటి కోసం తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే, శ్రద్ధ తల కోసం మెహ్రౌలీలోని ఓ చెరువును పోలీసులు ఖాళీ చేస్తున్నారు. మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు.
శ్రద్ధా వాకర్ తలను మెహ్రౌలీలోని ఆ చెరువులో పడేసినట్టు విచారణలో ఆఫ్తాబ్ చెప్పాడని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో చెరువులో గాలింపు చేసేందుకు నీటిని ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సిబ్బంది సాయంతో ఢిల్లీ పోలీసులు ఈ పనులు చేస్తున్నారు.
Delhi Shraddha Walker Murder Case: గంజాయి మత్తులో ఘాతుకం!
ఢిల్లీ ఛత్తర్ పూర్‍లోని ఓ అపార్ట్ మెంట్‍లో ఈ ఏడాది మే 18న తన లివ్- ఇన్-పార్ట్ నర్ శ్రద్ధా వాకర్ ను ఆఫ్తాబ్ కిరాతకంగా చంపాడు. ముంబై నుంచి ఢిల్లీ వచ్చిన కొంతకాలానికే ఈ దురాగతానికి పాల్పడ్డాడు. శ్రద్ధాను గొంతు నులిమి చంపిన ఆఫ్తాబ్.. ఆ తర్వాత ఆమె శరీరాన్ని పాశవికంగా 35 ముక్కలు చేశాడు. ఫ్రిడ్జ్ లో ఆ శరీర భాగాలను స్టోర్ చేశాడు. ఆ తర్వాత మెహ్రౌలీ అడవిలో వాటిని రోజుకు కొంత చొప్పున పారేశాడు. ఈ విషయాలను విచారణలో ఆఫ్తాబ్ అంగీకరించాడు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నానాటికీ విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఆఫ్తాబ్ కిరాతకాలు బయటికి వస్తున్నాయి. గంజాయి మత్తులో శ్రద్ధను అతడు హతమార్చినట్టు తెలిసింది. ఇంటి ఖర్చులు ఎవరు భరించాలన్న విషయంలో మే 18న గొడవ మొదలై.. ఇతర విషయాలకు మళ్లిందని తెలిసింది. ఆ తర్వాత గంజాయితో కూడిన సిగరెట్ తాగిన ఆఫ్తాబ్.. శ్రద్ధపై దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరినందుకు శ్రద్ధను ఆఫ్తాబ్ చంపాడని తెలిసింది. వెబ్ సిరీస్ డెక్సర్ ను చూసి శరీరాన్ని ముక్కలుగా చేసినట్టు విచారణలో అతడు అంగీకరించినట్టు తెలిసింది.
ముంబైకు చెందిన శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్‍కు మూడేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్‍లో పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. సహజీవనం చేశారు. ఈ ఏడాది మేలోనే ముంబై నుంచి ఢిల్లీకి వచ్చారు. అనేక చోట్ల తిరిగి చివరికి ఛత్తర్ పూర్‍లోని ఓ అపార్ట్ మెంట్‍లో ఫ్లాట్‍ను అద్దెకు తీసుకున్నారు. అక్కడే శ్రద్ధను ఆఫ్తాబ్ హతమార్చాడు. తనను మోసం చేస్తున్నావని, వెంటనే పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు అతడు ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. అంతకు ముందు కూడా శ్రద్ధను ఎన్నో సార్లు ఆఫ్తాబ్ చిత్ర హింసలకు గురి చేశాడని తెలిసింది. శ్రద్ధ ఆచూకీ తెలియడం లేదని ఆమె తండ్రి ఈనెల మొదట్లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆఫ్తాబ్‍ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. దీంతో ఐదు నెలల క్రితం జరిగిన ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది.