Delhi Murder: టీవీ సిరీస్, కొత్త ఫ్రిడ్జ్.. యువతి హత్య ఘటనలో విస్తుగొలిపే విషయాలు-man chopped live in partner into 35 pieces dumps in forest inspired by dexter tv show ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Murder: టీవీ సిరీస్, కొత్త ఫ్రిడ్జ్.. యువతి హత్య ఘటనలో విస్తుగొలిపే విషయాలు

Delhi Murder: టీవీ సిరీస్, కొత్త ఫ్రిడ్జ్.. యువతి హత్య ఘటనలో విస్తుగొలిపే విషయాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2022 11:51 PM IST

Delhi Murder: ప్రియురాలిని ఓ యువకుడు 35 ముక్కలుగా నరికి చంపిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరిన్ని విస్తుగొలిపే విషయాలు బయటికి వచ్చాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాశవిక ఘటన జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపాడు ఓ యువకుడు. హత్య జరిగిన ఐదు నెలల తర్వాత ఇది బయటపడింది. ఈ హత్య కేసులో సంచలన నిజాలు తెలుస్తున్నాయి. ప్రియురాలిని ఆ యువకుడు 35 ముక్కలుగా నరికి.. కొన్నిరోజుల పాటు వాటిని మొహ్రౌలీ అడవిలో పడేశాడు. దీంతో పాటు మరిన్ని విస్తుపోయే విషయాలు ఉన్నాయి.

Delhi Murder Case: టీవీ సిరీస్ చూసి..

అమెరికన్ టీవీ సిరీస్ డెక్స్టర్ (Dexter) ను చూసి ఆ యువకుడు ఈ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఓ సీరియల్ కిల్లర్ చేసే హత్యల గురించి కల్పిత కథతో తీసిన క్రైమ్ టీవీ సిరీస్ డెక్స్టర్. దీన్ని చూసి అఫ్తాబ్ అమీన్ పూనవాలా అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ (26) ను పాశవికంగా అఫ్తాబ్ చంపేశాడు. ఈ ఏడాది మే 18న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుందామని కోరిన ప్రియురాలిని 35 ముక్కలుగా అఫ్తాబ్ నరికాడని పోలీసులు వెల్లడించారు.

Delhi Murder Case: ఫ్రిడ్జ్ కొని..

ప్రియురాలు శ్రద్ధను హత్య చేశాక అఫ్తాబ్ 300 లీటర్ల కొత్త రిఫ్రిజిరేటర్ కొన్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె శరీర భాగాలను అతడు ఆ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి.. ప్రతీ రోజు వాటిని కొంచెం కొంచెంగా మెహ్రౌలీ అడవిలో పారేశాడట. 18 రోజుల పాటు రాత్రి 2 గంటలు దాటక ఇలా చేశాడని పోలీసులు వెల్లడించారు. వాసన పక్కన ఇళ్లలోకి వెళ్లకుండా అగరుబత్తీలను ఎక్కువగా వెలిగించే వాడని పేర్కొన్నారు. రక్తాన్ని ఎలా క్లీన్ చేయాలి, మానవ శరీరం గురించి గూగుల్‍లో వెతికాడని తేలింది.

Delhi Murder Case: ఇదీ జరిగింది

ముంబైలోని ఓ ఎంఎన్‍సీలో శ్రద్ధ ఉద్యోగం చేసేది. అఫ్తాబ్ ఆమెకు అక్కడే పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించటంతో ఇద్దరూ ఢిల్లీకి మకాం మార్చారు. మొహ్రౌలీ ప్రాంతంలో నివసిస్తుండేవారు. అయితే కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అఫ్తాబ్‍ను శ్రద్ధ కోరింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 18న శ్రద్ధను అఫ్తాబ్ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది.

Delhi Murder Case: విచారణ ఇలా..

ముంబైను విడిచి వెళ్లాక శ్రద్ధ కుటుంబ సభ్యులు ఆమెకు చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ కనెక్ట్ కాలేదు. దీంతో శ్రద్ధ తండ్రి.. ఈనెల 8వ తేదీన ఢిల్లీ వెళ్లారు. శ్రద్ధ ఉంటున్న ఇంటి అడ్రస్‍కు వెళ్లగా.. తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు అఫ్తాబ్ పునావాలను అరెస్ట్ చేశారు. విచారణలో తన తప్పును అఫ్తాబ్ అంగీకరించాడు. పెళ్లి చేసుకోవాలని గొడవ చేసినందుకు శ్రద్ధను హత్య చేసినట్టు అతడు చెప్పాడని పోలీసులు వెల్లడించారు.

Whats_app_banner