Twtching Eye | కన్ను అదరడం దేనికి సంకేతం? ఊపిరి గట్టిగా పీల్చుకొని ఇది చదవండి!-wondering why your eyes twitch then read this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Twtching Eye | కన్ను అదరడం దేనికి సంకేతం? ఊపిరి గట్టిగా పీల్చుకొని ఇది చదవండి!

Twtching Eye | కన్ను అదరడం దేనికి సంకేతం? ఊపిరి గట్టిగా పీల్చుకొని ఇది చదవండి!

Manda Vikas HT Telugu
Mar 05, 2022 08:02 AM IST

మన కళ్లు అప్పుడప్పుడు అదిరినట్లు అనిపిస్తుంది. ఎడమ వైపుగానీ, లేదా కుడివైపు గానీ కనురెప్పల్లో నాడీ ఏదో కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతి కొద్దిసేపు వరకు కొనసాగుతుంది.

<p>కన్ను అదరడం</p>
కన్ను అదరడం (Shutterstock)

మన కళ్లు అప్పుడప్పుడు అదిరినట్లు అనిపిస్తుంది. ఎడమ వైపుగానీ, లేదా కుడివైపు గానీ కనురెప్పల్లో నాడీ ఏదో కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతి కొద్దిసేపు వరకు కొనసాగుతుంది. 

ఈ కన్ను అదరడం (twitching eye) రాబోయే రోజుల్లో మంచి లేదా చెడు కర్మలకు సంబంధించిన సంకేతాలను సూచిస్తుందని మనలో చాలా మంది విశ్వసిస్తారు. మగ వారికి కుడి కన్ను అదిరితే శుభసూచకం, ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరగబోతుందని చెప్తారు. అలాగే ఆడవారికైతే ఇది రివర్స్‌గా ఉంటుంది. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని, కుడికన్నైతే ఏదైనా ఆపద వస్తుందని నమ్ముతారు. మరి ఇందులో నిజమెంత అంటే? ఇవి కేవలం వారి విశ్వాసాలు, నమ్మకాలు మాత్రమే. ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి బలమైన, కచ్చితమైన నిరూపణ అయితే జరగలేదు.

ఇదో వ్యాధేనా?..

ఈ కన్ను అదరడాన్ని వైద్యపరిభాషలో 'మయోకిమియా' అంటారు. ఇదొక వ్యాధి అని చెప్పటానికి వీలు లేదు కానీ, కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థలో ఏదైనా లోపం తలిత్తితే ఈ కన్ను అదరడం అనేది జరుగుతుంది. అలసిపోవడం, కాఫీ-టీలు ఎక్కువగా తీసుకోవడం లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన, ఒత్తిడి కారణంగా నిద్రలేమి లాంటి సమస్యలు తలెత్తితే అది నేరుగా కంటికి సంబంధించిన నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దానివల్ల కనురెప్పలో గానీ, కంటికింద గానీ, లేదా కనుబొమ్మల దగ్గర ఉండే నాడుల్లో చిన్న కదలికలు రావడం జరుగుతుంది. ఆ కదలికల వలనే మనకు కన్ను అదిరినట్లు అనిపిస్తుంది.

కన్ను అదరడానికి గల కారణాలు..

కళ్లపై భారం మోపడం: రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తే, తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూడటం లేదా మొబైల్ చూస్తూ ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం ద్వారా కళ్లపై చాలా భారం పడుతుంది. దీనివల్ల కళ్లు సంకోచానికి గురవుతాయి. ఇది కేవలం కన్ను అదరటమే కాకుండా, కళ్లు మిటకరించటం, రెటినా దెబ్బతినటం లాంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.

ఒకవేళ మీరు రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటే మధ్యమధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటూ ఉండండి, ఉన్నచోటనే అప్పుడప్పుడూ 3 నుంచి 5 నిమిషాలు కళ్లు మూసుకొని కళ్లకు కొంత విశ్రాంతినిస్తూ పోయినా ఈ సమస్యలను అధిగమించవచ్చు.

నిద్రలేమి, అలసట: 

మీకు ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తి సంబంధమైన కారణాల ద్వారా నిద్రలేమి, అలసట లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే కన్ను అదరడం జరుగుతుంది. కంటికి సరైన నిద్ర, విశ్రాంతి చాలా అవసరం అదే మిమ్మల్ని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నిద్రలేమితో బాధపడేవారు సమయం దొరికినప్పుడల్లా చిన్నపాటి కునుకు తీస్తే సమస్యను దూరం చేసుకోవచ్చు.

అలెర్జీలు: 

శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి, మరియు దగ్గు, పడిశంతో జ్వరం ఉన్నవారికి కూడా కళ్ల సంకోచాన్ని గుర్తించవచ్చు.

ఈ కంటి సంకోచాలకు సంబంధించి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, నిరపాయమైనవి కూడా. అయితే ఇది శరీరంలో మెదడు- నాడీవ్యవస్థకు తలెత్తిన లోపాలను సూచిస్తుంది. కాబట్టి అందుకు దారితీసే కారణాలు తగ్గించుకుంటే మంచిది.

ఇదిలా ఉంటే, కొన్నిసార్లు రెండు కళ్లలో ఈ కదలికలు లేదా శరీరంలో ఏదైనా భాగంలోని కండరాలలో సంకోచాలు గమనిస్తే అవి టోరెట్ సిండ్రోమ్, బెల్స్ పల్సీ లాంటి రుగ్మతలను తెలియజేస్తుంది. వైద్యులను సంప్రదిస్తే అనుమానాలు తీరిపోతాయి.

 

Whats_app_banner