Sashtanga Namaskaram: స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?
భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు మాత్రం అస్సలు చేయకూడదని అంటారు. కానీ, ఎందుకో తెలియదు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? మహిళలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో నమస్కారం చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండోది పంచాంగ నమస్కారం. దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు, పూజలు జరిగినప్పుడు గురువులకు, దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. ఈ విధంగా పురుషులు చేయడం చాలా సార్లు చూసుంటాం. కానీ మహిళలు మాత్రం చేయరు. ఆడవారిని సాష్టాంగ నమస్కారం చేయవద్దని చెబుతారు. అసలు ఎందుకు చెయ్యనివ్వరో? ఇప్పుడు చూద్దాం.
సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?
సాష్టాంగ నమస్కారం అంటే (స + అష్ట + అంగ = సాష్టాంగ) 8 అంగములతో నమస్కారం చేయడం అని అర్థం. ఎనిమిది అంగాలైన వక్ష స్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కనులు భూమిపై ఆనించి చేసే వందనం. ఇలా పురుషులు చేయవచ్చు.
అసలు కారణమిదే..
కానీ, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భ కోశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల గర్భ కోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుందనే మన శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.
ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించివచ్చు.స్త్రీలు నమస్కరించుకోవాలి అనుకున్నప్పుడు‘పంచాగ నమస్కారాన్ని' అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా నమస్కరించుకోవడం మంచిది.
* దేవాలయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు దేవుడికి-ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభానికి వెనుక చేయాలి.
* పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ పడాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను ఒక్క సాష్టంగ నమస్కారం వల్ల పొందుతారని శాస్త్రం చెబుతోంది.
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః… సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి.
* శివుడుకు, విష్ణువుకు నమస్కరించేటపుడు తల నుంచి 12 అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. శివకేశవుల్లో ఏ భేదం లేదని చాటడానికి ఇది సంకేతం. హరి హరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు. గురువునకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.
* తండ్రికి, ఇతర పెద్దలకు నోరుకు ఎదురుగా చేతులు జోడించాలి. తల్లికి నమస్కరించేటపుడు చాతికి ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి. యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.
సంబంధిత కథనం