Cold Intolerance । అందరికంటే మీకే ఎక్కువ చలిగా ఉంటుందా? అయితే జాగ్రత్త, చెక్ చేయించుకోండి!
Cold Intolerance: మీరు విపరీతమైన చలితో బాధపడుతున్నారంటే అందుకు చలి వాతావరణం మాత్రమే కారణం కాదు, అంతర్లీనంగా ఉండే సమస్యలు కారణం కావచ్చు.
చలికాలంలో చలిగా అనిపించడం, చలికి వణకడం సహజం. కానీ మిగతా వారికంటే మీరు విపరీతమైన చలితో వణికిపోతుంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే. కొందరు సీజన్‌తో సంబంధం లేకుండా చలిని అనుభూతి చెందుతారు. ఇలాంటి వారు వాతావరణం చలిగా లేకపోయినప్పటికీ, స్వెటర్ల లాంటి వెచ్చని దుస్తులు ధరిస్తారు. దీనికి ప్రధాన కారణం వీరి శరీరం చలికి సున్నితత్వాన్ని ప్రదర్శించడమే.
కొందరికీ కొన్ని ఆహారాలు సరిపడకపోతే ఫుడ్ అలర్జీ కలుగుతుంది, మరికొందరికి పాలు సరిపడవు, అదేవిధంగా కొందరికి చలి పడుదు. ఇది ఒకరమైన సున్నితత్వం (Cold Intolerance) అని చెప్పవచ్చు. సాధారణంగా సన్నగా ఉండే వారికి, శరీరంలో కొవ్వు లేనివారికి ఇతర వ్యక్తుల కంటే చలి ఎక్కువ ఉంటుంది. ఈ చలికాలంలో మిగతా వారితో పోలిస్తే మీకు విపరీతంగా చలిపెడుతుందంటే మీ శరీరం చలికి తట్టుకోవడం లేదని అర్థం. అందుకు అంతర్లీనంగా ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
రక్తహీనత- Anemia
రక్తహీనత ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణం చలి. ఇనుము లోపం కారణంగా ఎర్ర రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. ఇది శరీరాన్ని చలికి గురి చేస్తుంది. ఎర్ర రక్త కణాలు మీ శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళతాయి. మీరు రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్‌ను పొందదు, ఇది మీ జీవక్రియ మందగించడానికి కారణమవుతుంది. ఇది చలిని కలిగిస్తుంది, చలికాలంలో తీవ్రత ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతారు.
హైపోథైరాయిడిజం- Hypothyroidism
హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి పని చేయని స్థితి. థైరాయిడ్ గ్రంథి సాధారణంగా జీవక్రియలు, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మీ శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాలేకపోతే, మీరు చలిని అనుభూతి చెందే అవకాశం ఉంది. అలసట, మలబద్ధకం, బరువు పెరగడం లక్షణాలను గమనించవచ్చు.
మధుమేహం- Diabetes
డయాబెటీస్ మూత్రపిండాలపై మాత్రమే కాకుండా, శరీరంలో రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులకు శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు దగ్గు, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీరు నడక, వ్యాయామాలు చేయడం వలన వార్మప్ పొందవచ్చు.
విటమిన్ B12 లోపం- Vitamin B12 Deficiency
బాగా చలిగా అనిపించడం, అలసట, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఆకలి లేకపోవడం వంటివి విటమిన్ B12 లోపంను సూచించే కొన్ని లక్షణాలు. శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గినపుడు మీకు చలికాలంలో ఎక్కువ చలి ఉంటుంది. దీనిని నివారించేందుకు పాలు, గుడ్లు, పనీర్, చికెన్ వంటి వేడి గుణాలు కలిగిన ఆహారాలు తినాలి.
బలహీనమైన జీవక్రియ- Poor Metabolism
అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల, వృద్ధాప్యం కారణంగా శరీరం జీవక్రియలు నెమ్మదిగా సాగుతాయి. దీంతో శరీరానికి వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇలాంటి వారు కూడా చలికి వణికి పోతారు.
నరాల బలహీనత- Nerve Weakness
నరాలు దెబ్బతిన్నప్పుడు, నరాల బలహీనపడినపుడు చలి లక్షణాలు ఉంటాయి. నరాల సంబంధిత సమస్యలు కలవారు శీతాకాలంలో చాలా వణుకుతారు. అలాగే అలసట, కళ్లు తిరగడం, కళ్లు మండటం వంటి సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి వారు విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
చలికి సున్నితత్వం ఉన్నవారు శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా చలికి తట్టుకోలేకపోతే వైద్యులను సంప్రదించాలి.
సంబంధిత కథనం