Hardik Pandya: నడుము దాకా మంచు నీటిలో హార్దిక్ పాండ్యా.. కారణం ఇదే
Hardik Pandya: హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐస్ బాత్ చేస్తున్న ఫొటోలు పంచుకున్నాడు. దీని ఉష్ణోగ్రత ఎంతుంటుంది? ప్రయోజనాలు ఏంటో తెల్సుకోండి.
మంచునీటిలో స్నానం చేయడం వల్ల అథ్లెట్లు వాళ్ల శరీరాన్ని చల్లబరుచుకుంటారు. వ్యాయామం అనంతరం ఉపశమనం కోసం ఇది మంచి మార్గం. క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా తన శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి ఐస్ వాటర్ బాత్ చేస్తూ కనిపించారు. అసలు దీని ప్రయోజనాలేంటో తెల్సుకోండి.
హార్దిక్ పాండ్యా:
హార్దిక్ పాండ్యా ఐస్ బాత్ తో రీఛార్జ్ చేసుకుంటున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. క్రికెట్ సీజన్ మధ్య విరామంలో తనకు కావాల్సిన రిలాక్సేషన్ గురించి పంచుకున్నాడు. పోర్టబుల్ పూల్ లో మంచు నీటిలో నడుము దాకా మునిగి చిరునవ్వులు చిందిస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు.
ఐస్ వాటర్ బాత్ అంటే ఏమిటి?
ఐస్ వాటర్ బాత్‌లో శరీరాన్ని చల్లని నీటిలో ఉంచుతారు. సాధారణంగా దీని ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కండరాల పునరుద్ధరణకు సహాయపడటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ మంచు స్నానాలను అథ్లెట్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తారు.
ఐస్ వాటర్ బాత్ వల్ల ప్రయోజనాలు:
జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అధిక తీవ్రత గల వ్యాయామాల తర్వాత కోలుకోవడానికి మంచు స్నానాలు సహాయపడతాయి. ఇవి కండరాల శక్తిని మెరుగుపరుస్తాయి. నొప్పి, మంటను తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి.
రోగనిరోధక శక్తి:
ఈ స్నానాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఎందుకంటే చల్లని నీటిలో క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తిని అది ప్రేరేపిస్తుంది. ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి కీలకమైనవి.
చురుకుతనం:
ఐస్ వాటర్ బాత్ శరీర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో అప్రమత్తత, శక్తి స్థాయులు పెరుగుతాయి. ముఖ్యంగా మబ్బుగా అనిపించే వేసవి నెలల్లో బద్ధకం తగ్గించుకోడానికి శరీరానికి సహాయపడుతుంది.
మంచి నిద్ర:
మంచు నీటి స్నానం చేసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది శరీరం నిద్రకు సిద్ధం కావడానికి సహజ సంకేతం. అందువల్ల, ఐస్ స్నాన శీతలీకరణ ప్రభావం సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.