Saturday Motivation: జీవితంలో ఇలాంటివి ఘటనలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది, లేకుంటే మీపై నెగిటివిటీ మొదలవుతుంది
Saturday Motivation: జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక మంచి లేదా చెడు జరుగుతూనే ఉంటుంది. మంచి జరిగినప్పుడు ఎగిరి గంతేసి, చెడు జరిగినప్పుడు కుంగిపోకూడదు. మంచి జరిగినప్పుడు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉండవచ్చు. ఇది సోషల్ మీడియా యుగం మంచి జరిగినా, చెడు జరిగినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేస్తూ ఉంటారు. చెడు జరిగినప్పుడు పెద్దగా ఎవరూ స్పందించరు కానీ, మంచి జరిగితే మాత్రం తమకు అలా జరగలేదని భావిస్తూ ఉంటారు. మరికొందరు మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నెగిటివ్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి జీవితంలో ఏదైనా మంచి జరగబోతున్నప్పుడు మౌనంగా ఉండటం మంచిదని చెబుతున్నారు పెద్దలు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి విషయాలను ఇతరులతో పంచుకోకూడదో తెలుసుకోండి.
ఉద్యోగం లేదా పదోన్నతి
మీరు ఉద్యోగాలు మారుతున్నా లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందినా, జీతం బాగా పెరిగినా ఆ సమయంలో మౌనంగా ఉండండి. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండి తన సన్నిహితులకు మాత్రమే ఈ శుభవార్తను తెలియజేయాలి. ఎందుకంటే ఎక్కువ మందికి చెప్పడం వల్ల నెగిటివిటీ పెరిగి చేసిన పని చెడిపోతుంది. కాబట్టి పని పూర్తయ్యే వరకు కొత్త ఉద్యోగం గురించి, ప్రమోషన్ గురించి ఎవరికీ చెప్పకండి.
కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు
మీరు ఏవైనా ఆస్తులు కొన్నప్పుడు వీలైనంత మౌనంగా ఉండడం మంచిది. అదే విధంగా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఒక ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తుంటే ఆ విషయాన్ని ఎక్కువ మందికి చెప్పకూడదు. ఈ సందర్భాన్ని చాలా సన్నిహితుల మధ్యే వేడుకలా చేసుకోవాలి. అంతే కానీ ఆస్తిని కొనుగోలు చేసిన సంగతి ఎక్కువ మందికి చెప్పకూడదు. మీ గురించి మాట్లాడే వారి సంఖ్య పెరిగిపోతుంది.
మీరు జీవితంలో విజయం సాధించడానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ విషయం ఎక్కువ మందికి చెప్పకూడదు. పని పూర్తయ్యే వరకు ఆ విషయాన్ని బయట పెట్టకూడదు. ఒక కొత్త ఒప్పందం ఖరారు అవుతున్న సమయంలో, వ్యాపారంలో విజయం లభిస్తున్న సమయంలో మీరు ఎక్కువ మందికి ఆ విషయాన్ని చెప్పకూడదు. రహస్యంగానే ఉంచాలి. ఈ విషయాలను పని పూర్తికాకముందే చెబితే చాలా వరకు పని అసంపూర్తిగా ఉండిపోతుంది. నెగిటివిటీ పెరిగిపోతుంది.