Leg Cramps: నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా? ఇలా చేస్తే నొప్పిపోవడం పక్కా!
మనలో చాలా మందికి రాత్రి పూట కాళ్ల పిక్కలు పట్టేస్తుంటాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో నాక్చర్నల్ లెగ్ క్రాంప్స్ (Nocturnal Leg Cramps) అని అంటారు. ఈ నొప్పి వల్ల రాత్రుళ్లు చాలా మందికి నిద్ర భంగం కలుగుతుంది.
మీరు గాఢంగా నిద్రిస్తున్నప్పుడు హఠాత్తుగా కాలి పిక్కలు ఎప్పుడైనా పట్టుకున్నాయా? బాధతో విలవిల్లాడిపోయారా? ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. కాలి పిక్కలు
పట్టేసినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే ఒక్కోసారి పాదాలు, తొడల్లోనూ ఈ విధంగా కండరాలు పట్టేస్తుంటాయి. ఫలితంగా ఆయా భాగాల్లోనూ భయంకరమైన నొప్పి కలుగుతుంది. కండరాలు పట్టేసినప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలు కొన్ని సార్లు వంకర పోయినట్లు అవుతాయి. ఒక్కోసారి కాలి వేళ్లకూ ఇలా జరుగుతుంది. ఫలితంగా అవి కూడా వంకరగా మారినట్లు అనిపిస్తుంది. అయితే ఈ సమస్య కొందరిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.
వృద్ధులకు ఈ సమస్య అధికం..
సహజంగా కండరాలు పట్టేసినప్పుడు ఆ నొప్పి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం దానంతట అదే తగ్గిపోతుంది. కొందరికి ఈ సమస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ కొందరికి రోజూ రాత్రి సమయంలో పగలు కూడా ఇలా అవుతుంటుంది. 60 ఏళ్లు పైబడిన వారికి సహజంగానే ఈ విధమైన నొప్పి వస్తుంటుంది. కానీ ఇతర వయస్సుల వారికి కూడా పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఫెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్, లివర్ జబ్బులు, కిడ్నీ వ్యాధులు, రక్తనాళాలు పూడుకుపోవడం, వెరికోస్ వీన్స్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా కండరాలు పట్టేస్తుంటాయి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
పోషకాలుండే ఈ ఆహారం..
రోజూ కనీసం 30 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా పొటాషియం, మెగ్నిషియం లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి లోపించినప్పుడు కండరాలు ఈ విధంగా పట్టేస్తుంటాయి. కాబట్టి ఆహారంలో ఈ పోషకాలు ఉంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు, అరటి పండ్లు, తర్బూజా, క్యారెట్లు, నారింజ పండ్లు, పాలు, చేపలు, పాలకూర, టమాటాలు, చిలగడ దుంపలు లాంటి ఆహారాల్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. బాదంపప్పు, పచ్చికొబ్బరి, చేపలు, పాలకూర, అవకాడోలు, జీడిపప్పు, చింతపండు, అరటి పండ్లు లాంటి ఆహారాల్లో మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతుంది.
ఈ ద్రవాలతో ఎంతో మేలు..
కండరాలు పట్టేయకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రించే ముందు 2 టీ స్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. అంతేకాకుండా అశ్వగంధ చూర్ణం ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాలలో కలిపి తీసుకోవాలి లేదా అశ్వగంధ ట్యాబ్లెట్లను తీసుకోవచ్చు. ఈ సమస్యకు ఉసిరి జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. రోజు రాత్రి భోజనానికి ముందు 30 మిల్లి లీటర్ల ఉసిరి జ్యూస్‌ను తాగండి. ఈ విధంగా చేస్తే కాలి పిక్కలు పట్టుకుపోవడం నుంచి బయట పడవచ్చు.
తొడ కండరాలు పట్టుకున్నప్పుడు మంచు గడ్డలను ఒక గుడ్డలో వేసి నొప్పి ఉన్న చోట మర్దనా చేయాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఫలితంగా త్వరగా నొప్పి తగ్గుతుంది. జండూ బామ్ కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని నొప్పి ఉన్నచోట రాసి ఒక 5 నిమిషాల తరువాత మంచు ముక్కలను పెట్టాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
సంబంధిత కథనం