Food Adulteration: పండ్ల నుంచి పాల దాకా.. కల్తీని మీరే చెక్ చేయగల ట్రిక్స్ ఇవి-tricks and tips to check food adulteration at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food Adulteration: పండ్ల నుంచి పాల దాకా.. కల్తీని మీరే చెక్ చేయగల ట్రిక్స్ ఇవి

Food Adulteration: పండ్ల నుంచి పాల దాకా.. కల్తీని మీరే చెక్ చేయగల ట్రిక్స్ ఇవి

Koutik Pranaya Sree HT Telugu
Sep 28, 2024 04:30 PM IST

Food Adulteration: కల్తీ ఆహారాలు ఏవో గుర్తించడం అవసరం. కొన్ని చిట్కాలు తెల్సుకుంటే రోజూవారీ వాడే పదార్థాల్లో కల్తీ జరిగిందా లేదాని గుర్తించడం సాధ్యం అవుతుంది. ఆ ట్రిక్స్ ఏంటో చూడండి.

కల్తీ పదార్థాలు గుర్తించి చిట్కాలు
కల్తీ పదార్థాలు గుర్తించి చిట్కాలు

తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ఆహార పదార్థాలను కల్తీ చేసి విచక్షణారహితంగా విక్రయిస్తున్నారు. పాల నుంచి ధాన్యాల వరకు, జీలకర్ర నుంచి తేయాకు వరకు కల్తీ జరుగుతోంది. పాలలో నీరు కలపడం, వెన్నలో పిండి పదార్ధాలను కలపడం లేదా తక్కువ నాణ్యత కలిగిన ధాన్యాలతో నాణ్యమైన ధాన్యాలను కల్తీ చేయడం సాధారణం అయ్యింది. పిండిలో సున్నపు పొడిని కలిపి, పప్పులో ఇసుక లేదా రాయి కలిపితే వాటి బరువు పెరుగుతుంది. ఇలా ప్రతి పదార్థాన్ని ఎలా కల్తీ చేస్తున్నారో, ఆ కల్తీని మనం ఎలా చెక్ చేసుకోవచ్చో తెల్సుకోవడం అవసరం.

కల్తీ ప్రభావం:

ఆహార పదార్థాల కల్తీ మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఫుడ్స్ జర్నల్ 2023 లో ప్రచురితమైన ఒక అధ్యయనం నివేదిక ప్రకారం, కల్తీ ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తులు విరేచనాలు, గుండె జబ్బులు, అలెర్జీలు, వెర్టిగో, డయాబెటిస్ వంటి వాటికి సులభంగా గురవుతారు. కల్తీ వస్తువులను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఉదర సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఏఏ పదార్థాల కల్తీని ఎలా గుర్తించాలి?

తేనె:

ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. తేనె నీటి అడుగుకు చేరితే అది స్వచ్ఛమైనదని అర్థం. తేనెలో పంచదార లేదా బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తే అది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది.

పసుపు, కారం పొడి:

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలపండి. స్వచ్ఛమైన పసుపు గ్లాసు అడుగున పేరుకుపోయి నీరు పారదర్శకంగా ఉంటుంది. పసుపు వేయగానే నీటి రంగు మారితే పసుపు కల్తీ అయిందని అర్థం. అదేవిధంగా ఎండుమిర్చి పొడి కూడా వేడినీటి అడుగుకు చేరుతుంది. కల్తీ కారం పొడి నీటిలో రంగు వదులుతుంది.

పాలు:

ఏదైనా ఒక పాత్ర మీద ఒక చుక్క పాలు వేయాలి. పాలు ఎలాంటి మరక వదలకుండా కిందికి జారిపోతే మీ పాలలో నీటి కల్తీ ఉందని అర్థం. అలాగే పాలు బాగా కలిపినప్పుడు నురగ ఏర్పడుతుంటే కూడా కల్తీ జరిగినట్లే.

టీ, కాఫీ:

తడి కాగితంపై కొద్దిగా టీ పొడి చల్లాలి.దాని మీద లేదా ఇంకేదైనా రంగు కనిపిస్తే టీ పొడిలో రంగు కలిపారని అర్థం.

కాఫీ పొడిని పరీక్షించడానికి, నీటిలో కొద్దిగా కాఫీ పొడిని కలపండి. స్వచ్ఛమైన కాఫీ అడుగుకు చేరే ముందు కొన్ని సెకన్లు నీటి మీద తేలుతుంది. కల్తీది అయితే అడుగుకు చేరుకుంటుంది.

కూరగాయలు:

పండ్లు, కొన్ని కూరగాయలకు ఏదైనా పూత వేసి కల్తీ చేశారని అనుమానంగా ఉంటే, తినడానికి సంకోచంగా ఉంటే ఈ టెస్ట్ పనికొస్తుంది. దూది ఉండను నీరు లేదా నూనెలో ముంచి కూరగాయలపై, లేదా పండ్లపై రుద్దాలి. పత్తి రంగు మారితే కృత్రిమ రంగు కోటింగ్ వాడారని అర్థం.

గోధుమ పిండి:

గోధుమ పిండిలో కల్తీకి చెక్ పెట్టాలంటే ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ పిండి కలపాలి. కల్తీ జరగని పిండి నీటి అడుగుకు చేరిపోతుంది. నీరు స్వచ్ఛంగా కనిపిస్తుంది. కల్తీ అయితే నీటిలో కలిసిపోతుంది. నీరు పారదర్శకంగా కనిపించదు.

బటర్:

చెంచాలో కొద్దిగా బటర్ వేసి కరిగించాలి. స్వచ్ఛమైన వెన్న కరిగి గోధుమ రంగులోకి మారుతుంది. కల్తీ వెన్న కరగడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తెల్లని అవశేషాన్ని కూడా వదిలేస్తుంది.

కొబ్బరి నూనె :

స్వచ్ఛతను పరీక్షించడానికి, ఫ్రిజ్ లో కొద్దిగా నూనె పోసి పెట్టండి. నూనె గడ్డకడితే అది స్వచ్ఛమైనదని అర్థం. ఇతర నూనెలతో కల్తీ చేసిన కొబ్బరి నూనె గడ్డకట్టదు.

టాపిక్