Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ సర్దినట్లుగా ఉండాలంటే.. ఈ 6 చిట్కాలను పాటించాల్సిందే!-tips and tricks for clutter free home organizing tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ సర్దినట్లుగా ఉండాలంటే.. ఈ 6 చిట్కాలను పాటించాల్సిందే!

Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ సర్దినట్లుగా ఉండాలంటే.. ఈ 6 చిట్కాలను పాటించాల్సిందే!

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 07:30 PM IST

Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ సర్దనట్లుగా, గందరగోళంగా ఉంటోందా. అయితే చిన్న చిన్న పొరపాట్లే దానికి కారణం. కొన్ని టిప్స్ పాటిస్తే పదే పదే ఇల్లు సర్దాల్సిన అవసరం ఉండదు. అవేంటో చూసేయండి.

హోం ఆర్గనైజేషన్
హోం ఆర్గనైజేషన్ (pexels)

మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఇల్లు దులపడం, సర్దడం ప్రారంభిస్తాం. ఆ పనులన్నీ అయిపోయాక ఇల్లంతా చాలా ప్రశాంతంగా, అందంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు మళ్లీ మామూలే. పరిస్థితి చిన్నా భిన్నంగా తయారవుతుంది. ఏ వస్తువు కావాలన్నీ వెతకడానికి సమయం పడుతుంది. ఇంట్లో ఇలాంటి గందరగోళాలు ఏమీ ఉండకూడదంటే మనం ఎప్పుడూ కొన్ని కొన్ని చిట్కాలను పాటిస్తూ ఉండాలి. అందువల్ల ఇల్లు చెత్త పెరిగిపోకుండా, కావాల్సినవి అప్పటికప్పుడు కనిపించేట్లుగా ఉంటాయి.

ఇల్లు సర్దుకునేందుకు టిప్స్:

1. మీ ఇంటిని ఒక్కసారి అంతా పరిశీలించి చూడండి. ఎక్కడ ఎక్కువగా అనవసరమైన వస్తువులు పేరుకుపోతున్నాయో గమనించండి. ఆన్‌లైన్‌ షాపింగ్‌లు చేశాక వచ్చే అట్టపెట్టెల్ని తీసి పడేయకుండా ఎక్కడ సర్దేస్తున్నారో చూడండి. వాటన్నింటినీ తీసి అవసరం వస్తాయని అనుకున్న వాటిని పైన అరల్లో ఎక్కడైనా సర్దండి. కింద అవసరం లేనివన్నీ తీసివేయండి.

2. మీ టేబుల్‌ సరుగుల్లో, బీరువాల్లో అనవసరమైన బిల్లులు, సామాన్లు చాలా పరుచుకుపోతూ ఉంటాయి. వాటిని ఎప్పుడో ఇల్లు పండుగలకు దులిపేంత వరకు అలానే ఉంచుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం లేదు అనుకున్న వాటిని అప్పుడే తీసి పడేస్తూ ఉండండి. అందువల్ల మీ గందరగోళం చాలా తగ్గిపోకపోతే అడగండి.

3. ఎప్పుడో అవసరం పడతాయి అనుకునే వాటి కోసం ప్రత్యేకంగా చోటును ఏర్పాటు చేయండి. అవి కింద వైపు అల్మరాల్లో కాకుండా పైన ఎక్కడైనా సర్దేయండి. అలాంటి వాటి కోసం స్టోరేజ్‌ బాస్కెట్లను పైన ఏర్పాటు చేసుకోండి.

4. దీపావళికి పెట్టిన దీపాలు మళ్లీ ఏడాదికి అవసరం అవుతాయి. అలాగే రకరకాల పూజలకు చేసిన డెకరేషన్‌లు మళ్లీ వచ్చే ఏడాదికి గాని అవసరం ఉండదు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కువగా వాడుకునే బీరువాల్లో పెట్టుకోవద్దు. వాటన్నింటినీ చక్కగా కవర్లలో ప్యాక్‌ చేసి అట్టపెట్టెల్లో సర్ది అటుకులు, సన్‌సైడ్ల మీదకు ఎక్కించేయండి. లేదా ఇంట్లో మనం వాడకుండా ఉండే పై అరల్లోకి సర్దేయండి. దీంతో కింద వీటి వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు ఉండవు.

5. పెద్ద పెద్ద కుక్కర్లు, గిన్నెల్లాంటి వాటిని మీరు ఎప్పుడో ఒకసారి వాడుతుంటారు. ఎవరైనా ఎక్కువ మంది భోజనానికి వచ్చినప్పుడు మాత్రమే వాడే అలాంటి వాటిని కిచెన్‌లో కింద ఎక్కడా పెట్టుకోవద్దు. అవి స్థలాన్ని ఆక్రమించేస్తాయి. మనకు అవసరం అయిన వస్తువులు కనబడకుండా చేస్తాయి. కాబట్టి తక్కువగా వాడే వస్తువులన్నింటినీ స్టోర్‌ రూంలో, అటుకుల మీద సర్దేసుకోండి.

6. కారు, బండి తాళాల్లాంటి వాటిని చాలా మంది ఎక్కడో ఒక చోట పెట్టేసి వెతుక్కుంటూ ఉంటారు. ఇంటి దర్వాజకు ఉండే తలుపుకు వెనకాల వీటి కోసం హుక్కులను ఏర్పాటు చేసుకోండి. వెళ్లేడప్పుడు వీటి నుంచి తీసి పట్టుకెళ్లొచ్చు. వచ్చాక వెంటనే తలుపు వెనకాల తగిలించేయొచ్చు. అందువల్ల వెతుక్కునే సమయం చాలా వరకు తగ్గుతుంది.

Whats_app_banner