Eggless Cake | గుడ్డు లేని కేక్‌ను ఇలా తయారు చేసుకోండి.. పండగ చేస్కోండి!
కేక్ తినాలని ఉన్నా అందులో గుడ్డు ఉంటుందని తినలేకపోతున్నారా? మీకు మీరుగా గుడ్డులేకుండా ఎంతో సులభంగా తయారుచేసుకోగలిగే చాకొలేట్ కేక్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
పుట్టినరోజు అయినా, పెళ్లిరోజు అయినా మరేతర శుభకార్యం అయినా ఇప్పుడు కేక్ కట్ చేసి వేడుకను జరుపుకుంటున్నారు. అయితే ఈ కేక్ లలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ అన్నింటిలో ఎగ్ ఉంటుంది. దాదాపు కేక్ తయారీలో గుడ్డు ఒక ముఖ్యపదార్థంగా ఉంటుంది. ఎందుకంటే బేకరీ విధానంలో రోస్ట్ చేసే ఆహార పదార్థాలకు ఎమల్సిఫైయర్ అవసరం అవుతుంది. సరైన ఆకృతి, టెక్చర్, మంచి రుచి రావాలంటే గుడ్డు ఒక ఎమల్సిఫైయర్ లా పనిచేస్తుంది. ఇది పిండికి స్థిరత్వాన్ని, సమతుల్యతను తీసుకువస్తుంది. అందులో తేమను నింపుతుంది. మరి ఇన్ని రకాలుగా ఉపయోగం ఉన్నప్పుడు కేక్ లలో గుడ్డును వాడకుండా ఎలా ఉంటారు? కచ్చితంగా ఉపయోగిస్తారు.
అయితే కేక్ లలో గుడ్డు ఉండటం వలన చాలా మందికి కేక్ తినాలని ఇష్టం ఉన్నా తినలేకపోతున్నారు. కొందరైతే గుడ్డుతో చేసిన కేకును కట్ చేయటానికి కూడా ఇష్టపడరు. ఎగ్ లేకుండా ఫ్రూట్ కేక్ అని లభిస్తుంది కానీ అయినా కూడా ఎక్కడో అనుమానం ఉంటుంది. మరి ఇన్ని అనుమానాల నడుమ బేకరీలో లభించే కేక్ ఎందుకు? మీ ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా గుడ్డులేకుండా కేక్ చేసుకోండి.
చెఫ్ నటాషా సెల్మీ గుడ్డు లేకుండా వన్-పాట్ చాక్లెట్ కేక్ రెసిపీని పంచుకున్నారు. మరి ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ లెస్ కేక్ తయారీకి కావాల్సినవి
- 200 గ్రా మైదాపిండి
- 200 గ్రా చక్కెర
- 60 గ్రా కోకో పౌడర్
- 16 గ్రా (4 tsp) బేకింగ్ పౌడర్
- 450 ml పాలు/ బాదాం పాలు లేదా సోయా మిల్క్
- 35 ml వెజిటెబుల్ నూనె
- 1 tsp వెనీలా ఎసెన్స్
తయారీ విధానం
1. ఓవెన్‌ను 160 సెల్సియస్ వరకు వేడి చేయండి. ఆపై కేక్ తయారుచేసే టిన్‌ను గ్రీజ్ చేయండి, బటర్ పేపర్‌తో లైన్ చేయండి.
2. పెద్ద మిక్సింగ్ గిన్నెలో పొడి పదార్థాలను తీసుకొని కలపండి
3. మరొక గిన్నెలో తడిగా ఉండే పదార్థాలను కలపండి.
4. ఇప్పుడు ఈ తడి, పొడి పదార్థాలు రెండింటినీ ఒక గిన్నెలో కలపండి. పిండి కలిగిన దానిని ఎక్కువగా కలపవద్దు.
5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేన్ టిన్‌లో తీసుకొని 40-45 నిమిషాల పాటు బేక్ చేయండి. మిశ్రమం పైభాగం గట్టిగా మారిందని నిర్ధారించుకోండి.
6. ఇప్పుడు ఓవెన్ నుంచి కేకును బయటకు తీసి చల్లబరచండి.
7. పైనుంచి మీకు నచ్చిన వాటితో ఫ్రాస్టింగ్ క్రీంతో గార్నిష్ చేయండి. కొంచెం ఐసింగ్ షుగర్‌ని చల్లండి ఇది మంచి రూపాన్ని ఇస్తుంది.
అంతే ఎగ్ లేని కేక్ సిద్ధమైపోయింది. ఇంకా ఎలాంటి అనుమానాలు లేకుండా తియ్యని వేడుకను చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్