Saturaday Motivation: సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించండి వాస్తవాలను గ్రహించండి
Saturaday Motivation: జంతువులను, మనుషులను విడదీసేది ఆలోచనా శక్తి. జంతువులు ఆలోచించలేవు, కానీ మనిషి ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలడు. మీ ఆలోచన శక్తికి మీరే పదును పెట్టుకోవాలి.
Saturaday Motivation: ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి. వాటన్నింటిలో మనిషిని ప్రత్యేకంగా నిలిపినది ఆలోచనలే. వారి ఆలోచన శక్తే వారిని గొప్ప బలమైన జీవులుగా మార్చింది. మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. చెప్పుడు మాటలు విని పైపై ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోకండి. ఏ అంశంపై నైనా లోతుగా ఆలోచన చేయండి. వాస్తవాలను గ్రహించేందుకు ప్రయత్నించండి. అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే స్నేహాలు, అనుబంధాలను నిలుపుకోగలుగుతారు.
ఒక మనిషిలో ఉండే ఆలోచనా శక్తి వారిలో కొత్త చైతన్యాన్ని నింపుతుంది. మనిషికి ప్రాణం ఆలోచన. అదే జీవితానికి శక్తినిస్తుంది. ఆలోచనలే మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపిస్తాయి. అతడిని ఉన్నతంగా మార్చేది కూడా అతని ఆలోచనలే.
మీ ఆలోచనలే మీ వ్యక్తిత్వం. మీ నడవడికను నిర్ణయిస్తాయి. ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఆలోచిస్తారు. ఎవరైతే సరైన పద్ధతిలో ఆలోచిస్తారో, వాస్తవాన్ని చూడగలుగుతారో... వారే గొప్ప వారిగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది మనిషి మాత్రమే. మిగతా జీవజాతులన్నీ ఆలోచన లేకుండానే తోచిన పని చేస్తాయి.
ఏ అంశం పైనైనా నిర్ణయం తీసుకునే ముందు పైపై మెరుగులను చూడకూడదు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలలో లోతుగా ఆలోచనలు చేయాలి. అప్పుడే మీకు నిజం తెలుస్తుంది. ఆలోచన శక్తి లేనివారు దారిద్య్రంలో కుంగిపోతారు. వారి సుఖసంతోషాలు కూడా ఎక్కువ కాలం నిలవవు. భయంతో, అనుమానంతో బాధపడుతూ ఉంటారు.
ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన ఆవిష్కరణలన్నీ లోతైన ఆలోచనల నుండి ఉద్భవించినవే. ప్రతి విజయం వెనక ఒక సరైన లోతైన ఆలోచన ఉంటుంది. శక్తివంతమైన ఆలోచనలన్నీ ఒక వ్యక్తి సొంత అనుభవం నుంచి లేదా వారు ఎదుర్కొనే సవాళ్ల నుండి పుట్టినవే. ఎవరో ఒకరు వస్తారని వారు తమ సమస్యలను పరిష్కరిస్తారని వేచి ఉండకుండా... మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు లోతుగా ఆలోచించాలి. ఆ ఆలోచన నుండే పరిష్కారాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
లోతైన ఆలోచనలు చేయడం అంటే మేధో మథనం అనే అర్థం. ప్రపంచాన్ని మార్చే ఆలోచనలన్నీ ఎంతో మేధోమథనం అనంతరమే జరిగాయి. కాబట్టి ఏ అంశం లోనైనా ఐదు నిమిషాల్లో ఆలోచించి, ఐదు సెకన్లలో నిర్ణయాలు తీసుకోకండి. కొంత సమయాన్ని కేటాయించి, లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం చాలా ముఖ్యం.