Urine Smell : వీటితో మూత్రం దుర్వాసన.. ఇవి మీ ఫుడ్ లిస్టులో ఉన్నాయా?
Urine Smell : కొంతమంది మూత్రం పోయగానే దుర్వాసన ఎక్కువగా వస్తుంది. దీంతో ఆందోళన చెందుతారు. డాక్టర్ వద్దకు వెళ్లి టెస్టులు చేయిస్తారు. ఇలా మూత్రం దుర్వాసన ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?
మూత్రం ఒక రకమైన వాసన కలిగి ఉంటుంది. ఈ వాసనకు ఒక కారణం ఉంది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేనప్పుడు వాసన వస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు మనం తీసుకునే ఆహారాలతో ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఆ వాసన భరించలేనంతగా మారి ఆందోళన కలిగిస్తుంది.
మూత్రం దుర్వాసన వస్తే సాధారణంగా చింతించాల్సిన అవసరం లేదు. అది దానంతట అదే తగ్గిపోతుంది. కానీ రోజు రోజుకు విపరీతమైన దుర్వాసన ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. చెడు వాసనతో కూడిన మూత్రం వివిధ శారీరక సమస్యలకు లక్షణం కావచ్చు. అయితే కొన్ని ఆహారాలు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి.
మనం తినే ఆహారం మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి తీసుకునే ఆహారం, పానీయాలు.. మూత్రాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. మూత్రాన్ని దుర్వాసన కలిగించే కొన్ని ఆహారాలు ఉన్నాయి.
ఎక్కువగా కాఫీ తాగడం వల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. కాఫీలోని సమ్మేళనాలు మూత్రం దుర్వాసనకు కారణమవుతాయి. అంతేకాదు, కాఫీలో ఉండే కెఫిన్ మూత్రవిసర్జన ఎక్కువగా అయ్యేందుకు కారణం అవుతుంది. రోజుకు చాలా సార్లు కాఫీ తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రం రంగు కూడా మారుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయ ఎక్కువగా తినడం వల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫరస్ రసాయనాలు ఉంటాయి. ఫలితంగా మూత్రం దుర్వాసన వస్తుంది.
మీరు స్పైసీ ఫుడ్ తింటే, దాని ద్వారా కూడా మూత్రం వాసన వస్తుంది. జీలకర్ర, పసుపు, కొత్తిమీర వంటి మసాలా దినుసులు మూత్రం దుర్వాసనను కలిగిస్తాయి. నిజానికి ఈ మసాలా దినుసుల్లో ఉండే సుగంధ రసాయనాలు మన శరీరంలోనే ఉంటాయి. ఆహారం జీర్ణం అయిన తర్వాత మూత్రం వాసన వస్తుంది.
తక్కువ నీరు తాగడం వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. అప్పుడు మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. దుర్వాసన వచ్చే మూత్రం కూడా డీహైడ్రేషన్‌కు సూచన. మూత్రంలో నిజానికి అమ్మోనియా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ హైడ్రేటెడ్ గా ఉంటే అంత మంచిది. శరీరం నిర్జలీకరణం అయినప్పుడు, అమ్మోనియా గాఢత కూడా పెరుగుతుంది. ఫలితంగా వాసన కూడా ఎక్కువగా వస్తుంది.
మూత్రం దుర్వాసన రావడం వ్యాధి లక్షణమా?
దుర్వాసనతో కూడిన మూత్రం కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దానితో పాటు మంట నొప్పి, తరచుగా మూత్రవిసర్జన, సాధారణం కంటే ఎక్కువ మూత్రం పోయడం వంటి ఇతర లక్షణాలు సంభవిస్తే, అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. టైప్ 2 మధుమేహం, మూత్రపిండాల్లో రాళ్లు కూడా మూత్రం దుర్వాసనకు కారణమవుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది.