Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి-the husband test which is trending on social media do this test once ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Haritha Chappa HT Telugu
May 07, 2024 12:30 PM IST

Husband Test: సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్క టాపిక్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు వైరల్ అవ్వడం అందరికీ తెలిసింది. ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ వైరల్ గా మారింది.

హస్బెండ్ టెస్టు
హస్బెండ్ టెస్టు (Pixabay)

Husband Test: సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది హస్బెండ్ టెస్ట్. ఇది ఒక రిలేషన్‌షిప్ టెస్ట్ అని చెప్పుకోవాలి. దీనికి హస్బెండ్ టెస్ట్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇది ఎందుకు వైరల్ అయింది? అలాగే మీరు కూడా ఒకసారి దీన్ని ఎలా ట్రై చేయాలో తెలుసుకోండి.

ఇదే హస్బెండ్ టెస్ట్

ఈ టెస్టు ప్రకారం ప్రేమలో ఉన్న అమ్మాయిలు తమ ప్రియుడుని భర్త అని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఆ ప్రియుడు ఎలా రియాక్ట్ అయ్యాడనే క్షణాలను ఫోన్లో రికార్డు చేస్తారు. బాయ్ ఫ్రెండ్ నవ్వినా లేదా సానుకూలంగా స్పందించినా అతను మీ రిలేషన్ షిప్ లో చాలా సీరియస్ గా ఉన్నాడని అర్థం. అలా కాకుండా ఆ బాయ్ ఫ్రెండ్ తనను హస్బెండ్ అని పిలవొద్దని చెప్పడం లేదా కాస్త సీరియస్‌గా ముఖం పెట్టడం, ప్రతికూలంగా స్పందించడం వంటివి చేస్తే అతనికి ఆ రిలేషన్ షిప్ లో ఎక్కువ కాలం ఉండాలని లేదని అర్థం. అలా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే హస్బెండ్ టెస్ట్. ఇది ఎంతో వైరల్‌గా మారింది.

చాలామంది అమ్మాయిలు తమ భాగస్వామిని పరీక్షించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ టెస్టు విదేశాల్లోనే మొదలైంది. కెంజి గ్రీన్ అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ ను కావాలనే హస్బెండ్ అని పిలుస్తుంది. అతడి స్పందనను వీడియోలో రికార్డు చేస్తూ ఉంటుంది. ఆమె ప్రియుడు ‘నేను నీ భర్తని కాదు’ అని అంటాడు. దీంతో ఆమె అతను తన ప్రేమలో సీరియస్ గా లేడని అర్థం చేసుకుంటుంది. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అది వైరల్ గా మారడంతో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ అన్ని దేశాలకూ పాకింది.

గతంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఛాలెంజ్‌లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ కూడా చేరిపోయింది. అయితే ఈ చిన్న టెస్టు ద్వారానే మీ భాగస్వామిలోని నిబద్ధతను కొలవకూడదని అంటున్నారు. మానసికంగా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి మానసిక సంఘర్షణలో ఉన్నారో తెలియదని, కేవలం ఈ చిన్న టెస్ట్ ద్వారా వారి ప్రేమలో నిజాయితీ లేదని అంచనా వేయడం తప్పని చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఫన్నీ ఛాలెంజ్‌గా తీసుకుంటే పరవాలేదు, కానీ ప్రేమ ప్రయాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను మాత్రం తీసుకోకూడదని వివరిస్తున్నారు.

Whats_app_banner