Back Pain-వెన్నునొప్పి వేధిస్తుందా? వేగంగా ఉపశమనం పొందాలంటే..-suffering from back pain here are a few tips to relive ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Suffering From Back Pain? Here Are A Few Tips To Relive

Back Pain-వెన్నునొప్పి వేధిస్తుందా? వేగంగా ఉపశమనం పొందాలంటే..

Manda Vikas HT Telugu
Dec 30, 2021 04:53 PM IST

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ ప్రకారం, జనాభాలో 80% మంది తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ వెన్నునొప్పి దీర్ఘకాలికంగా ఉంటే, అది మీ రోజువారీ జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతుంది.

Back Pain
Back Pain (Shutterstock)

ఈ రోజుల్లో వెన్నునొప్పి (Back Pain) అనేది అందరికీ సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ (NINDS) ప్రకారం, జనాభాలో 80% మంది తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ వెన్నునొప్పి దీర్ఘకాలికంగా ఉంటే, అది మీ రోజువారీ జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతుంది. దీంతో మీరు ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

వెన్నుపూస బలహీనపడటం

ఒకే భంగిమలో ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, హైహీల్స్ ధరించడం, నిద్రపోయే పరుపు అసౌకర్యంగా ఉండటం, నిద్రలేమి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం లేదా తప్పుడు వ్యాయామాలు చేయడం, బరువు పెరగటం లేదా బరువులను ఎత్తడం మొదలగు కారణాల చేత వెన్నునొప్పి వస్తుంది. పోషకాహార లోపం, వృద్ధాప్యం కూడా కారణాలు కావొచ్చు. కొత్తగా ధూమపానం కూడా వెన్నునొప్పికి కారణమయ్యే జాబితాలో చేరింది. ధూమపానం అలవాటు కారణంగా శరీరం ఎముకల దృఢత్వం అవసరమయ్యే కాల్షియం శోషణను తగ్గిస్తుంది. దీంతో వెన్నుపూస బలహీనపడి అది వెన్నునొప్పికి దారితీస్తుంది.

మరి వెన్నునొప్పి నుంచి సత్వర ఉపశమనం కోసం ఏం చేయాలి అంటే ఇక్కడ కొన్ని చిట్కాలు అందించాం, ఇవి పాటించి చూడండి.

చిన్నపాటి వార్మప్

వెన్నునొప్పి కలిగినపుడు తేలికపాటి వార్మప్స్ చేయడం ద్వారా కొంత ప్రభావం ఉంటుంది. కొద్దిదూరం నడక, స్విమ్మింగ్ చేయడం, యోగాసనాలు వేయడం చేస్తే శరీరంలోని కండరాలు వదులుగా మారి వాటి నుండి 'ఎండోఫ్రిన్స్' అనే హర్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి నేచురల్ పెయిన్ కిల్లర్స్ గా పనిచేస్తాయి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకుంటే ఎలాంటి వెన్నునొప్పులు దరిచేరవు.

నడుముపై కాపడం

వెచ్చని లేదా చల్లని అనుభూతిని శరీరానికి కల్పించడం ద్వారా ఏ నొప్పి నుంచైనా ఉపశమనం పొందవచ్చు. ఐస్ ముక్కలు ఉన్న ప్యాకెట్‌ను నొప్పి బాధించే చోట కొద్దిసేపు అదిమి పట్టి ఉంచితే అది ఆ ప్రాంతంలో మొద్దుబారినట్లు చేస్తుంది. ఆ రకంగా నొప్పి నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక గుడ్డను వేడిచేసి, లేదా ఒక వాటర్ బాటిల్‌ను వేడినీటితో నింపి నొప్పి ఉన్న చోట పెట్టి రిలీఫ్ పొందొచ్చు, వేడి ఎక్కువ లేకుండా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

నడుము విరుచుట, స్ట్రెచింగ్స్

కొన్ని సెకన్ల నడుమును అన్ని వైపులా వంచడం ద్వారా ఫలితం లభిస్తుంది. అలాగని శరీరాన్ని బాగా వంచకూడదు, ఎలాంటి వొంపులను సృష్టించకూడదు, కొద్దిగా వంగడం మాత్రమే చేస్తూ ఉండాలి.

నొప్పి నివారణ క్రీమ్స్

పుదీనా లాంటి చలువ, మిరియాల- లాంటే మండే గుణాలున్న పెయిన్ రిలీఫ్ క్రీములు వాడితే నొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

హెర్బల్ ఆయిల్స్

మహానారాయణ తైలం, ధన్వంతరం తైలం, అశ్వగంధ తైలం, వటసమానతైలం లాంటి కొన్ని ఆయుర్వేద మూలికలతో కూడిన నూనెలు రాయడం ద్వారా కూడా దీర్ఘకాలిక వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

వీటన్నిటితో పాటు శరీరానికి తగినంత విశ్రాంతినివ్వడం, కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం ద్వారా కూడా వెన్నునొప్పి లేదా ఇతర ఏ నొప్పుల నుంచైనా వేగంగా బయటపడవచ్చు.

వెన్నునొప్పి మరింత బాధిస్తే చివరి అస్త్రంగా మెడిసిన్స్ అయిన అసిటామినోఫెన్ (Acetaminophen), ఐబూప్రొఫెన్ (Ibuprofen) లాంటి పెయిన్ కిల్లర్స్  తీసుకోవచ్చు. మీకు భరించలేనంత నొప్పి ఉంటే మాత్రం దానికి వేరే ఏవైనా కారణాలు ఉంటాయి, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.

WhatsApp channel

టాపిక్