Strawberry Milkshake: స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ఇంట్లోనే ఇలా తాజాగా, హెల్తీగా తయారు చేసేయండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు-strawberry milkshake recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strawberry Milkshake: స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ఇంట్లోనే ఇలా తాజాగా, హెల్తీగా తయారు చేసేయండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు

Strawberry Milkshake: స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ఇంట్లోనే ఇలా తాజాగా, హెల్తీగా తయారు చేసేయండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు

Haritha Chappa HT Telugu
Mar 22, 2024 06:00 AM IST

Strawberry Milkshake: ప్రతిరోజూ స్కూలుకి వెళ్లే ముందు పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. పాలకు బదులు ఒకసారి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇచ్చి చూడండి. వారికి చాలా నచ్చుతుంది. ఎన్నో పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి.

స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ (pixabay)

Strawberry Milkshake: వేసవి వచ్చేసింది... పిల్లలు ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మిల్క్ షేక్‌లను తయారు చేయొచ్చు. స్ట్రాబెర్రీ పండ్లను కొని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి ఎలాంటి కృత్రిమ రసాయనాలు వాడరు. అలాగే ఇది తాజాగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి నచ్చుతుంది. అలాగే ఆరోగ్యాన్ని అందిస్తుంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేయడం చాలా సులువు. కేవలం 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెసిపీకి ఏం చేయాలో చూద్దాం.

స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు

స్ట్రాబెర్రీలు - ఏడు

పెరుగు - అరకప్పు

తేనె - రెండు స్పూన్లు

యాలకుల పొడి - అర స్పూను

ఐస్ క్యూబ్స్ - రెండు

పాలు - ఒక కప్పు

స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీ

1. స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోండి.

2. బ్లెండర్లో ఈ స్ట్రాబెర్రీ ముక్కలు, పాలు, పెరుగు, యాలకుల పొడి, తేనె వేసి బాగా బ్లెండ్ చేయండి.

3. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేయండి. పిల్లలు చల్లగా కావాలని అడిగితే ఐస్ క్యూబ్స్ వేసి వారికి ఇవ్వండి.

4. ఐస్ క్యూబ్స్ వేయకుండా ఇస్తేనే ఆరోగ్యం.

5. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు కూడా ఇది చాలా నచ్చుతుంది.

6. దీనిలో తాజా స్ట్రాబెరీలు వేసాము కాబట్టి మిల్క్ షేక్ ఘుమఘుమలాడిపోతుంది. చక్కెరను మాత్రం వాడకండి.

7. ఉదయాన్నే చక్కెర వేసిన ఆహారాలు తినక పోవడమే మంచిది.

8. చక్కెరకు బదులు మేము ఇక్కడ తేనె ఉపయోగించాము.

9. అలాగే యాలకుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక పెరుగు, పాలు రెండూ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి.

స్ట్రాబెర్రీలు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ మార్కెట్లో లభిస్తున్నాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యము చక్కగా ఉంటుంది. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక దీనిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. స్ట్రాబెర్రీలతో పాటు ఇందులో పాలు, పెరుగు కూడా పుష్కలంగా వాడాము.

పాలల్లో ప్రోటీన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇక పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా జీర్ణక్రియకు మీరే చేస్తాయి. మనం చక్కెరకు బదులు తేనె వాడాము. తేనె సహజమైనది పైగా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. యాలకుల పొడిలో కూడా ఎన్నో న్యూట్రిషన్ విలువలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్‌ను వారికి స్కూలుకి వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగిపించండి. మధ్యాహ్నం వరకు వారికి ఆకలి వేయదు.

WhatsApp channel

టాపిక్