Sorakaya Payasam: సొరకాయ పాయసం ఇలా చేశారంటే ఒక్క స్పూన్ కూడా మిగలదు, దీన్ని చేయడం చాలా సులువు-sorakaya payasam recipe in telugu know how to make sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sorakaya Payasam: సొరకాయ పాయసం ఇలా చేశారంటే ఒక్క స్పూన్ కూడా మిగలదు, దీన్ని చేయడం చాలా సులువు

Sorakaya Payasam: సొరకాయ పాయసం ఇలా చేశారంటే ఒక్క స్పూన్ కూడా మిగలదు, దీన్ని చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu
May 24, 2024 04:00 PM IST

Sorakaya Payasam: ఆరోగ్యకరమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీంతో సొరకాయ పాయసం చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

సొరకాయ పాయసం రెసిపీ
సొరకాయ పాయసం రెసిపీ

Sorakaya Payasam: సొరకాయతో చేసే రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సొరకాయ చూడగానే ముఖం ముడుచుకునేవారు ఎంతోమంది. నిజానికి దీన్ని వండడం వస్తే ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము సొరకాయ పాయసం ఎలా చేయాలో ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ సొరకాయ పాయసాన్ని చేసి పెట్టండి. కచ్చితంగా వారికి నచ్చుతుంది.

సొరకాయ పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వెన్న తీయని పాలు - ఒకటిన్నర లీటరు

కండెన్స్‌డ్ మిల్క్ - ఒక కప్పు

సగ్గుబియ్యం - ఒక కప్పు

అన్నం - అరకప్పు

యాలకుల పొడి - చిటికెడు

నెయ్యి - రెండు స్పూన్లు

సొరకాయ తురుము - ఒక కప్పు

బాదం పప్పులు - గుప్పెడు

కిస్మిస్లు - గుప్పెడు

చక్కెర - రెండు స్పూన్లు

సొరకాయ పాయసం రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి.

2. ఆ నెయ్యిలో సొరకాయ తురుమును వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలి.

3. ఆ తర్వాత రెండు స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.

4. ఈ రెండూ ఉడుకుతున్నప్పుడు పాలు వేసి పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.

5. తర్వాత యాలకుల పొడి వేయాలి. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి.

6. అలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

7. సొరకాయ తురుము, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికినంతవరకు చిన్న మంట మీదే ఉంచాలి.

8. ఒక 20 నిమిషాలు ఇవి ఉడకడానికి సమయం పడుతుంది.

9. ఆ తర్వాత కండెన్స్‌డ్ మిల్క్ ను వేసి కలుపుకోవాలి.

10. అలాగే వండిన అన్నాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి.

11. ఒక చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.

12. ఆ నెయ్యిలో కిస్మిస్లు, బాదం, జీడిపప్పులు వంటివి వేయించి పాయసం మీద వేసుకోవాలి. చల్లబడ్డాక దీన్ని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

13. ఫ్రిజ్లో పెట్టుకొని తింటే వేసవిలో ఇంకా రుచిగా అనిపిస్తుంది. దీన్ని తిన్నారంటే ఎవరికైనా బాగా నచ్చేస్తుంది.

సొరకాయలో మనకు కావలసిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెసిపీలో మనం చక్కెర కేవలం రెండు స్పూన్లు మాత్రమే వాడాము కాబట్టి మిగతావన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కండెన్స్‌డ్ మిల్క్‌లో స్వీట్ నెస్ ఉంటుంది. అది దీనికి మంచి రుచిని అందిస్తుంది. అలాగే నెయ్యి కూడా వేసాము. కాబట్టి పాయసం ఘుమఘుమలాడిపోవడం ఖాయం. ఒక్కసారి చేసి చూడండి... మీకు చాలా నచ్చుతుంది.

Whats_app_banner