Masoor dal tadka: రెస్టారెంట్ స్టైల్ మసూర్ దాల్ తడ్కా.. కాస్త వెరైటీగా..-restaurant style masoor dal tadka recipe in simple steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masoor Dal Tadka: రెస్టారెంట్ స్టైల్ మసూర్ దాల్ తడ్కా.. కాస్త వెరైటీగా..

Masoor dal tadka: రెస్టారెంట్ స్టైల్ మసూర్ దాల్ తడ్కా.. కాస్త వెరైటీగా..

Koutik Pranaya Sree HT Telugu
Sep 27, 2023 12:30 PM IST

Masoor dal tadka: రెస్టరెంట్ స్టైల్ మసూర్ పప్పు దాల్ తడ్కా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్ లో దాన్నెలా చేసుకోవాలో వివరంగా చూసేయండి.

మసూర్ దాల్ తడ్కా
మసూర్ దాల్ తడ్కా (feepik)

ఆకుకూరలతో అయినా, టమాటాతో అయినా పప్పు చేయాలంటే ఎక్కువగా కందిపప్పునే వాడతాం. కానీ వారానికి కనీసం రెండు మూడు సార్లయినా ఎర్రకందిపప్పు లేదా మసూర్ పప్పు వాడటం చాలా మంచిది. దీంట్లో పోషక విలువలు ఎక్కువ. గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. గర్భినీలు కూడా ఈ పప్పును తినడం ఆరోగ్యదాయకం. మన కందిపప్పు లాగే దీంతో కూడా అన్ని రకాలుగా విభిన్న ప్రయోగాలు చేసి వండొచ్చు. రెస్టరెంట్లలో ఉండే మసూర్ దాల్ తడ్కా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఎర్ర కందిపప్పు లేదా మసూర్ పప్పు

1 చెంచా గరం మసాలా లేదా రాజ్మా మసాలా

తగినంత ఉప్పు

1 చెంచా కారం

పావు చెంచా పసుపు

1 చెంచా ధనియాల పొడి

సగం చెంచా జీలకర్ర పొడి

2 చెంచాల నూనె

3 వెల్లుల్లి రెబ్బలు

1 చెంచా అల్లం, సన్నని ముక్కలు

1 చెంచా పచ్చిమిర్చి తురుము

1 పెద్ద ఉల్లిపాయ, ముక్కలు

కొద్దిగా కొత్తిమీర

పావు కప్పు పెరుగు

తయారీ విధానం:

  1. ముందుగా మసూర్ పప్పును 1 గంటపాటూ నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. 2 కప్పుల నీల్లు పోసుకోవాలి.
  2. అదే పప్పులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  3. ఇప్పుడు కడాయిలో తడ్కా కోసం నూనె లేదా బటర్ తీసుకుని వేడెక్కాక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. అవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి రంగు మారేంత వరకు వేగనివ్వాలి.
  4. కుక్కర్ మూత తీసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. అందులో ముందుగా వేసుకున్న తాలింపును వేసుకుని బాగా కలపాలి.
  5. పప్పు వేడిగా ఉన్నప్పుడే మీద కాస్త బటర్, చిక్కని పెరుగు, కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. ఒక నిమిషం పాటూ సన్నని మంట మీద ఉడికించుకుని దించేసుకుంటే చాలు. వేడి వేడి రెస్టరెంట్ స్టైల్ మసూర్ దాల్ రెడీ.

Whats_app_banner