వర్షాకాలంలో శ్వాసకోశ అలెర్జీ.. ఫంగల్ సైనస్‌కు సర్జరీ అవసరమవుతుందని మీకు తెలుసా?
వర్షాకలం తేమ వల్ల ఫంగస్ పెరిగి సైనస్‌లకు సోకుతుంది. ఇక్కడ ఫంగల్ సైనసిటిస్ రకాలు, వర్షాకాలంలో శ్వాసకోశ అలెర్జీని నయం చేయడానికి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరమవుతుంది వంటి వివరాలు తెలుసుకోండి.
వానాకాలంలో అలెర్జీలు ఒక సమస్య. తేమ కారణంగా బాక్టీరియా, ఫంగస్ పడక గదిలోని దుప్పట్లు, పరుపులు, ఇతర గృహోపకరణాలపై దాడిచేస్తాయి. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అయితే, తేమ వల్ల ఫంగస్ పెరిగినప్పుడు అది ముక్కుభాగమైన సైనస్‌లకు సోకుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఫంగల్ సైనసిటిస్‌కు దారి తీస్తుంది.
ఫంగల్ అలర్జీ వల్ల ముక్కులో నొప్పి వస్తుందని ఈఎన్ టీ సర్జన్ డాక్టర్ వికాస్ అగర్వాల్ చెబుతున్నారు. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ 55 ఏళ్ల మహిళ తలనొప్పితో తన వద్దకు రాగా సీటీ స్కాన్ ద్వారా ఆమెకు ఫంగల్ సైనసైటిస్ అని తేల్చినట్టు డాక్టర్ తెలిపారు. ఇది ప్రాణాపాయ స్థితి గా మారిందని, ఆమెకు శస్త్రచికిత్స అవసరం ఏర్పడిందని వివరించారు.
డాక్టర్ అగర్వాల్ దీని గురించి వివరిస్తూ ‘ఫంగల్ సైనసిటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. సాధారణమైనది, అలాగే తీవ్రమైనది. సాధారణ ఫంగల్ సైనసిటిస్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్ సైనస్‌లను మందపాటి శ్లేష్మంతో నింపేలా చేస్తుంది. పాలిప్స్ ఏర్పడతాయి. శిలీంధ్రాలు సైనస్‌లలో పేరుకుపోతాయి. ముక్కు లోపల శ్లేష్మం మీద ఫంగస్ పెరుగుతుంది. ఈ రకమైన సాధారణ ఫంగల్ సైనసిటిస్ అన్నింటికీ ప్రాథమిక శస్త్రచికిత్స అవసరం.
కాంప్లెక్స్ ఫంగల్ సైనసిటిస్ ప్రాణాంతకమైనది. దీని సంక్రమణ పుర్రె, మెదడులోకి ప్రవహించే అవకాశం ఉంది. ఇవి అరుదైనవే. కానీ ప్రాణాంతకం. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో ఫంగస్ ముక్కులోని రక్త నాళాలను నాశనం చేస్తుంది. కణజాలం చనిపోవడం ప్రారంభమవుతుంది. ఇన్ఫెక్షన్ త్వరగా కళ్ళు, మెదడుకు వ్యాపిస్తుంది, ఇది అంధత్వం, మరణానికి దారితీస్తుంది..’ అని డాక్టర్ అగర్వాల్ వివరించారు.
ఇప్పుడు అధునాతన వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నావిగేషన్-గైడెడ్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలు ఈ అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దుతాయి. ఇది సురక్షితమైన, నొప్పిలేకుండా ఉండే ఎంపిక. ఇన్‌ఫెక్షన్‌లు, పాలీప్‌లు పునరావృతం కాకుండా చూసుకుంటుంది. అందువల్ల ఫంగల్ సైనసిటిస్‌ను నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ అగర్వాల్ సూచించారు.