Mango Popsicles । ఎండల్లో హాయి హాయి.. మ్యాంగో పాప్సికల్స్ ఇంట్లోనే ఇలా చేసుకోండి
ఎండాకాలంలో స్కూల్ విడిచిన తర్వాత గేట్ దగ్గర అమ్మే ఐస్ పాప్స్ తినడం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పటి మీ మధురానుభూతులను మీకు గుర్తుచేసేలా, ఇంట్లోనే తయారుచేసుకొనే మ్యాంగో పాప్సికల్స్ రెసిపీని అందిస్తున్నాం. చల్లచల్లగా తినేయండి..
వేసవికాలం వస్తూనే ఎన్నోరకాల రుచులను తీసుకొస్తుంది. ఈ ఎండాకాలంలో మనం పండ్లు, కూరగాయలు, ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు, మిల్క్ షేక్‌లు ఇలా ఎన్నో రకాల పదార్థాలను ఇష్టంగా తింటాం, తాగుతాం. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఈ సీజన్ మామిడిపండ్లు ఇంకా ఐస్ క్రీమ్- పెప్సీలకు ప్రసిద్ధి. మనం మామిడి పండును ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు, అలాగే ఈ సీజన్‌లో ఐస్ పాప్స్ తినకపోతే ఎలా? మీరు మ్యాంగో ఐస్ పాప్సికల్స్ తినే ఉంటారు. కానీ పులిహోరలో పులి ఉండనట్లు, మ్యాంగో ఫ్లేవర్ పాప్సికల్స్ లో మామిడి రుచి ఉంటుంది కానీ మామిడి పండు కంటెంట్ ఉండదు. అందుకే ఇంట్లోనే సొంతంగా, సులభంగా మీకు మీరే మ్యాంగో పాప్సికల్స్ తయారు చేసుకోండి.
చెఫ్ శివేష్ భాటియా ఇంట్లోనే తయారుచేసుకునేలా మ్యాంగో పాప్సికల్ రెసిపీని అందిస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ పాప్సికల్ తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి అది ఎలాగో, ఏమేమి కావాలో కింద ఇచ్చాం చూడండి..
కావలసినవి:
½ కప్పు పెరుగు
¾ కప్పు మామిడిపండు ప్యూరీ
1-2 టేబుల్ స్పూన్లు తేనె
తయారీ విధానం
- మామిడిపండును రసాన్ని ఒక గిన్నెలో పిండి అందులో పెరుగు, తేనె కలపండి. ముద్దలుగా లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా బ్లెండ్ చేయాలి.
- ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్/కోన్స్ తీసుకుని బ్లెండ్ చేసుకున్న మామిడిపండు మిశ్రమాన్ని కుల్ఫీ పాత్రల్లో నింపుకోవాలి. ఆపై అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ వేయాలి.
- ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్ లను 8-10 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. ఆ తర్వాత నోరూరుంచే మ్యాంగో పాప్సికల్స్ మీకు సిద్ధంగా ఉంటాయి.
కొద్దిసేపు మీరు చిన్నపిల్లల్లా మారిపోయి ఎండల్లో హాయి హాయి అంటూ మ్యాంగో పాప్సికల్స్‌ను చప్పరిస్తూ తినండి.
Video:
మామిడిపండ్లలో శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియంతో లాంటి మినరల్స్ ఉంటాయి. ఇవి పల్స్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడిపండ్లలో ఉండే ప్రత్యేకమైన మాంగిఫెరిన్ సమ్మేళనం గుండె వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం