Ice Apple Sorbet | తాటి ముంజలతో ఐస్ క్రీమ్.. ఇలా కొత్తగా ట్రై చేయండి!
Ice Apple Sorbet Recipe - మీరు తాటి ముంజలు తిని ఉంటారు, కానీ తాటి ముంజలను క్రీమ్ చేసుకొని ఐస్ క్రీమ్‌లాగా ఎప్పుడైనా తిన్నారా? సాధారణంగా స్టార్ హోటెళ్లలో ఇలాంటివి అందిస్తారు. అయితే మీ ఇంట్లోనే చేసుకునే విధంగా ఇక్కడ ఒక సింపుల్ రెసిపీ అందిస్తున్నాం. ట్రై చేసి చూడండి.
ఈ ఎండాకాలం సీజన్‌లో మామిడి పండ్లతో పాటు మరో రకమైన పండ్లు కూడా విరివిగా లభిస్తాయి అవే నుంగు పండ్లు. వీటిని తాటి ముంజలు అని కూడా పిలుస్తారు. మరి మీరు ఈ సీజన్‌లో తాటి ముంజలు తిన్నారా? తినకపోతే కచ్చితంగా తినండి. ఎందుకంటే ఈ ఎండాకాలం పోతే మళ్లీ వచ్చే ఏడాది ఎండాకాలం వరకూ లభించకపోవచ్చు. వీటిలో పోషకాలకూ కొదవలేదు. తాటి ముంజల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గించడంలో తోడ్పడతాయి. బరువు తగ్గటంలో, పేగు ఆరోగ్యం, మెదడు ఆరోగ్యానికీ మంచివి అని చెప్తారు.
తాటి ముంజలను నేరుగా తినేయవచ్చు. కానీ ఆ తాటి ముంజలతో ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తింటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? బెంగళూరులోని కాన్రాడ్ హోటెల్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయినటువంటి వినోత్ కుమార్ జయప్రకాష్ ‘ఐస్ యాపిల్ సోర్బెట్’.. అంటే తాటి ముంజలతో ఐస్ క్రీమ్ లాంటి ఒక పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని రెసిపీని అందించారు. దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ వేసవిలో ఈ ఐస్ యాపిల్ సోర్బెట్ తింటే దాని టేస్టే వేరు, దాహం కూడా అనిపించదు. మరి ఇంకేం మీరు ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు
- తాటి ముంజలు - 6
- ఏలకులు - 10 గ్రాములు
- తాజా నిమ్మరసం - 5 మి.లీ
తయారీ విధానం
- తాటి ముంజలను పొట్టు తీయండి. పండుపై ఎలాంటి చర్మం లేకుండా చూసుకోండి. ఇప్పుడు వాటి గుజ్జును బాగా శుభ్రం చేయండి.
- మరోవైపు కొన్ని ఏలకులను వేయించి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో కొన్ని వేడి నీళ్ళు పోసి మూత పెట్టాలి.
- ఇప్పుడు తాటి ముంజల గుజ్జును ఒక బ్లెండర్‌లో వేయండి. ఆపై ఏలకుల నీటిని వడకట్టి పోయండి.
- ఇప్పుడు బాగా పానకం లాగా లేదా ప్యూరీగా బ్లెండ్ చేసుకోవాలి.
- తాటి ముంజల ప్యూరీకి నిమరసం వేసుకొండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గట్టిపడేంత వరకు ఫ్రీజర్లో ఉంచండి.
- ఆ తర్వాత ఐస్ క్రీమ్ చర్నర్‌తో కలపండి. దీనిని ఒక తాటి ఆకులో తీసుకొని గార్నిషింగ్ కోసం పైనుంచి ఏలకుల పొడిని చల్లుకోండి.
- నోరూరించే తాటి ముంజల ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే. చల్లచల్లగా ఆస్వాదించండి.
తాటి ముంజలతో ఇలా మంచి ఐస్ క్రీమ్ సోర్బేట్ చేసుకోవచ్చు. కానీ ఆలుగడ్డలాగా ఉడకబెట్టి కూరలు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి.
సంబంధిత కథనం