No Smoking day 2024: స్మోకింగ్ మానేయాలని ప్రయత్నిస్తున్న వారు కచ్చితంగా ఈ ఆహారాలను తినండి
No Smoking day 2024: ధూమపానం మానేయాలనుకుంటున్నారా? స్మోకింగ్ మానేసే ప్రయత్నంలో ఉన్నవారు తమ మెనూలో కొన్ని ఆహారాలను కచ్చితంగా తినాలి.
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా మానేయలేకపోతున్నవారు ఎంతో మంది. మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ధూమపానాన్ని మానేయాల్సిందే. సిగరెట్ కాల్చడం వల్ల విషపూరిత రసాయనాలు, కాన్సర్ కారకాలైన కార్సినోజెన్లను మీరు పీలుస్తారు. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని చంపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం, ప్రపంచంలో ధూమపానం చేసేవారిలో 12 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు.
ధూమపానం మానేయడం వల్ల మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. సిగరెట్ మానేసే క్రమంలో ఆరోగ్యకరమైన, పోషకాలు నిండిన ఆహారాన్ని తినడం చాలా అవసరం. సమతులాహారం తినడం వల్ల సిగరెట్ తాగే అలవాటును కట్టడి చేయవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయల, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ధూమపానం మానేయడానికి మీకు సహాయపడే ఆహారాలేమిటో తెలుసుకోండి.
1. రంగురంగుల పండ్లు, కూరగాయలు: యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. అనేక రకాల పండ్లు, కూరగాయలలో ఇవన్నీ దొరుకుతాయి . బెర్రీ పండ్లు, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, క్యారెట్లు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ధూమపానం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని సహాయపడతాయి.
2. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: కొవ్వు చేపలైన సాల్మన్, మాకేరెల్ వంటి వాటి చేపల్లో, అవిసె గింజలు, వాల్నట్స్ వంటి వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగ ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ధూమపానం వల్ల వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
3. నట్స్: బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి గింజలు వంటి వాటిని తినండి. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ధూమపానం వల్ల ప్రభావితమయ్యే చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
4. తృణధాన్యాలు: క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలను ఎంచుకోండి. అవి నిరంతర శక్తిని అందిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి. ధూమపానం మానేయడానికి ఇవి సహకరిస్తాయి.
5. లీన్ ప్రోటీన్లు: పౌల్ట్రీ, చేపలు, టోఫు, చిక్కుళ్ళు వంటి వాటిలో ఈ లీన్ ప్రోటీన్ లభిస్తుంది. కండరాల మరమ్మత్తుకు, నిర్వహణకు ప్రోటీన్ సహాయపడుతుంది. మీ శరీరం సానుకూల మార్పులకు సాయపడుతుంది.
6. హైడ్రేషన్: నీళ్లు అధికంగా తాగడం చాలా అవసరం. అలాగే ఔషద టీలు పుష్కలంగా తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఇలా శరీరంలో నీటి శాతం తగినంత ఉంటే సిగరెట్ మానేయడం సులువుగా మారుతుంది.
7. పాల ఉత్పత్తులు : పాలు, పెరుగును అధికంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. వీటిలో కాల్షియం తగినంత ఉంటుంది. ధూమపానం శరీరంలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఎముకలకు హాని చేస్తుంది. కాబట్టి కాల్షియం తగినంత తినడం చాలా అవసరం.
8. గ్రీన్ టీ: యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన తేనీరు… గ్రీన్ టీ. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ధూమపానం మానేయాలనుకునేవారికి మేలు చేస్తుంది.
ధూమపానం మానేసినప్పుడు, స్మోకింగ్ చేయాలన్న కోరికను అణిచి వేయడానికి పైన చెప్పిన ఆహారాలను తింటూ ఉండాలి. ధూమపానం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి సాయపడతాయి. నారింజ, కివి, బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తింటూ ఉండాలి. దోసకాయ, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు వచ్చేస్తాయి.
అదనంగా, తృణధాన్యాలు, ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే చిక్కుళ్ళు వంటివి తినాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల స్మోకింగ్ త్వరగా మానేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది స్థిరీకరిస్తుంది. ధూమపానం చేయాలనే కోరికను తగ్గిస్తుంది.