Sleeping Direction | ఏ దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది?
ఉత్తర దిక్కు తలపెట్టి నిద్రించవద్దని చెబుతారు. మరి ఏవైపు తలపెట్టి పడుకోవడం మంచిదో ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దు, తల మరోవైపు పెట్టాలి అని. మరి ఇందులో వాస్తవం ఉందా? పడుకునేందుకు కూడా ప్రత్యేకంగా దిక్కులు ఉంటాయా అంటే.. కచ్చితంగా ఉంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం ఏ వైపు తల పెట్టి పడుకుంటామో దాని ప్రకారంగా మనకు నిద్ర ఉంటుంది. దిక్కులు కూడా నిద్ర నాణ్యత, మానసిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.
ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలలో నిద్రాస్థానాలు, దిశలు అలాగే వాటి ప్రభావాలపై వివరణ ఉంది. ఏ దిశలో నిద్రించడం మంచిదో కూడా శాస్త్రం చెబుతుంది.
మరి ఏ వైపు తలపెడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? నిద్రపోవడానికి సరైన దిశ ఏది? అనే విషయాలపై ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్ష వివరించారు. సరిన దిశకు సంబంధించి సూచనలు చేశారు...
ఉత్తరం
ఉత్తర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభించదు. వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది. తీవ్రంగా అలిసిపోయినట్లు, ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. మధ్యలోనే మేల్కొనే అవకాశం ఉంటుంది. భూమికి ఉత్తర దిశ ధనావేశంతో ఉంటుంది, మనిషి తల కూడా ధనావేశంతో ఛార్జ్ అయి ఉంటుంది. దీంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనసులో కల్లోల పరిస్థితులను సృష్టిస్తాయి. అందుకే ఉత్తర దిక్కుకు ఎప్పుడూ తలపెట్టి పదుకోకూడదు.
దక్షిణ
దక్షిణం రుణావేశంతో ఛార్జ్ అయి ఉంటుంది. ఇటువైపు తలపెట్టి పడుకుంటే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. కాబట్టి మంచిగా నిద్రపట్టి, గాఢమైన నిద్రను అనుభవించాలంటే దక్షిణంవైపు తలపెట్టి నిద్రించాలి. దక్షిణవైపు తలపెట్టినపుడు శరీరంలో నుంచి శక్తి బయటకు పోదు. కాబట్టి ఉల్లాసంగా ఉంటుంది. ఇలాంటి నిద్ర మీ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు మంచిది.
పడమర
పడమరవైపు తలపెట్టి నిద్రపోవచ్చు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల స్థిరమైన నిద్ర ఉండదు. నిద్రలో మెలకువలు వస్తాయి, కలతగా ఉంటుంది. పీడకలలు ఎక్కువగా వస్తాయి. అంటే నిద్రపడుతుంది కానీ ప్రశాంతమైన నిద్ర కాదు.
తూర్పు
తూర్పువైపు తలపెట్టి నిద్రించడం ఎంతో మంచిది. ఇలా పడుకున్నపుడు ధ్యాన నిద్ర కలుగుతుంది. అంటే మీకు మంచి మంచి జ్ఞాపకాలు మీలో మెదలుతాయి, అందమైన కలలుకంటారు. తూర్పువైపు తలపెట్టి నిద్రించడం వలన రక్తప్రసరణ బాగుంటుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎక్కువమంది తూర్పు వైపు తలపెట్టి నిద్రించాలని సిఫారసు చేస్తారు.
మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే, పీడకలలతో సతమతమవుతుంటే ఒకసారి మీరు నిద్రించే దిశను మార్చుకొని చూడండి.
సంబంధిత కథనం