Navratri recipes: అమ్మవారికి నైవేద్యంగా.. ఈ రెండు రెసిపీలు ట్రై చేయండి..
Navratri recipes: నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రిగా కనిపించే అమ్మవారికి నైవేద్యం ప్రత్యేకంగా చేయాల్సిందే. అలాంటి సులభమైన రెండు రెసిపీలు చూసేయండి.
నవరాత్రి నైవేద్యాలు (Unsplash)
నవరాత్రులు మొదలయ్యాయి. ఇక ప్రతిరోజూ అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తాం. ప్రత్యేకంగా, సులువుగా చేయదగ్గ రెసిపీలు కోసం చూస్తుంటే ఈ రెండు రెసిపీలు మీకోసమే. ఒకటేమో కాస్త కారంగా ఉండే సాబుద్దానా కిచిడీ.. మరోటి కలాకండ్. ఉపవాసం ఉన్నవాళ్లు కూడా ఈ రెండింటినీ తీసుకోవచ్చు. వాటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
1. సాబుద్దానా కిచిడీ:
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు సాబుద్దానా
1 కప్పు నీళ్లు
కొద్దిగా ఉప్పు
సగం కప్పు పల్లీలు
2 చెంచాల నెయ్యి
2 పచ్చిమిర్చి తరుగు
2 చెంచాల అల్లం తరుగు
1 కప్పు ఉడికించిన బంగాళదుంప ముక్కలు
1 కరివేపాకు రెబ్బ
కొద్దిగా మిరియాల పొడి
సగం చెంచా నిమ్మరసం
కొద్దిగా కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- ముందుగా సాబుద్దానాను కడుక్కుని కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె లేకుండా పల్లీలను వేయించుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- అదే కడాయిలో నెయ్యి వేసుకుని వేడెక్కాక జీలకర్ర, పచ్చిమర్చి, అల్లం, బంగాళదుంప ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి.
- అన్నీ మగ్గాక పల్లీల పొడి కూడా వేసుకుని ఒకసారి కలిపి నానబెట్టుకున్న సాబుద్దానా వేసుకోవాలి. మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలియబెట్టాలి.
- ఒక అయిదునిమిషాల్లో సాబుద్దానా మెత్తగా అయిపోతుంది. చివరగా కొత్తిమీర వేసుకుని దించుకుంటే చాలు.
2. కలాకండ్:
కావాల్సిన పదార్థాలు:
2 లీటర్ల చిక్కటి పాలు
4 చెంచాల పంచదార పొడి
సగం చెంచా నెయ్యి
పావు టీస్పూన్ ఆలమ్
డ్రై ఫ్రూట్స్ పొడి
సిల్వర్ షీట్
తయారీ విధానం:
- ఒక పాత్రలో పాలు పోసుకుని బాగా మరగనివ్వాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి. కాస్త చిక్కబడ్డాక ఆలమ్ వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు పాలు గ్రేనీగా తయారవుతాయి. పాలల్లో ఉన్న నీళ్లన్నీ అలాగే ఇంగిపోయేదాకా పొయ్యిమీద పెట్టి కలియబెడుతూనే ఉండాలి.
- నీళ్లన్నీ ఇంకిపోయాక పంచదార వేసుకుని కలుపుతూ ఉండాలి.
- ఒక ట్రేకు నెయ్యి రాసుకుని పెట్టుకుని అందులో గట్టిపడ్డ పాల మిశ్రమాన్ని వేయాలి. మీద అవసరమనుకుంటే సిల్వర్ షీట్ తో అద్దుకుని, డ్రై ఫ్రూట్స్ పొడి చల్లుకోవాలి. ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకుంటే చాలు. కలాకండ్ రెడీ.