Murena One । గూగుల్‌కు సైతం షాకిచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్.. మురేనా వన్!
గూగుల్ అవసరం ఏమాత్రం లేకుండా ఉపయోగించగలిగే ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలయింది. దానిపేరే Murena One. ఇది ఒక యాంటీ గూగుల్ ఫోన్. యూజర్ల ప్రైవసీనే తన లక్ష్యం అని చెప్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి
సాధారణంగా ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా గూగుల్ భాగస్వామ్యంతోనే పనిచేయాల్సి ఉంటుంది. అయితే గూగుల్ పై ఆధారపడకుండా తాజాగా ఒక ఫోన్ మార్కెట్లోకి వచ్చింది, అదే మురేనా వన్ (Murena One). యూజర్ల ప్రైవసీనే ప్రాథమిక లక్ష్యంగా మురేనా కంపెనీ ఈ ఫోన్ ఆవిష్కరించింది. గత కొన్నేళ్లుగా మురేనా యూజర్ల ప్రైవసీ గురించి పోరాడుతోంది. వారి ఆన్‌లైన్ గోప్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉత్తమ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం కారణంగా యూజర్ల డిజిటల్ ప్రొఫైల్ బహిర్గంతం కాకుండా రక్షణ కల్పించాలని పాటుపడుతోంది. ఇందులో భాగంగానే మురేనా కంపెనీ తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ మురేనా వన్‌ను /e/OS v1 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తోంది. ఇది గూగుల్ నియంత్రిత సర్వీసుల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మీ జీవితంలో నుంచి గూగుల్‌ను తీసేస్తుంది.
ఇందులో గూగుల్ రహిత ఫోన్ కాబట్టి మురేనా వన్ ఫోన్ Google యాప్‌లను కలిగి ఉండదు. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్లేస్టోర్ కు బదులుగా ఈ ఫోన్‌లో ‘యాప్ లాంజ్’ ఉంది. ఇక్కడి నుంచి వినియోగదారులు కొత్త Android యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ వ్యక్తిగత డేటాను సేకరిస్తుంటే అలాంటి యాప్‌లపై 0-10 మధ్య రేట్ చేయడానికి ప్రైవసీ స్కోర్‌ను ఇచ్చే అవకాశం ఉంటుంది.
మురేనా అందించే ప్రీలోడెడ్ యాప్ లాంజ్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులు Google ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు ప్రత్యేకమైన ప్రకటనలు-లేని సెర్చ్ ఇంజిన్, ఇమెయిల్ ప్లాట్‌ఫారమ్, ఆన్‌లైన్ సెక్యూర్ స్టోరేజ్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్, క్యాలెండర్‌కు యాక్సెస్‌ను కలిగి ఉన్న మురేనా క్లౌడ్‌ను అందించింది.ఈ క్లౌడ్ 1GB ఉచిత స్టోరేజ్ నిల్వతో వస్తుంది.
ఇందులో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ మ్యాప్స్ కు బదులుగా Mozilla మ్యాప్స్ సేవలను ఉపయోగిస్తుంది. అలాగే OpenStreetMap ద్వారా ఆధారితమైన మ్యాప్‌లను కలిగి ఉంది. అదనంగా Google పోటీదారు అయిన ఎలివియా-AIపై మురేనా సేవలు అందిస్తోంది.
అంతేకాదు వినియోగదారులు వారి IP చిరునామా, ఇంకా జియోలొకేషన్‌ను కూడా రహస్యంగా ఉంచడానికి అనుమతించే ప్రత్యేకమైన అధునాతన గోప్యతా విడ్జెట్‌ను కలిగి ఉంటుంది.
ఇక మురేనా వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి.
Murena One స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 6.53 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
- 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్
- వెనకవైపు 48+8+5 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 25 MP సెల్ఫీ షూటర్
- ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP) ఆధారిత /e/OS V1 ఆపరేటింగ్ సిస్టమ్
- 4500 mAh బ్యాటరీ సామర్థ్యం
మురేనా వన్‌లో కనెక్టివిటీపరంగా 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v4.2, డ్యుఎల్ సిమ్ స్లాట్, GPS/ A-GPS, NFC, USB, 5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. సెన్సార్‌లపరంగా యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
మురేనా వన్ ధర USలో $369 (దాదాపు రూ. 28,600), ఐరోపాలో EUR 349 (దాదాపు రూ. 28,900)గా ఉంది. యూఎస్, యూకె, కెనడా, యూరప్, స్విట్జర్లాండ్‌లలో జూన్ నుంచి ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు Murena.com వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చునని కంపెనీ తెలిపింది.
సంబంధిత కథనం