Monsoon Safety Tips | వర్షకాలంలో సురక్షితంగా ఉండండి.. ఈ ముఖ్యమైనవి మరిచిపోవద్దు!
Monsoon Safety Tips: వర్షాకాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీకోసం ఇక్కడ కొన్ని భద్రతా చిట్కాలను అందిస్తున్నాం.
Monsoon Safety Tips: మాన్‌సూన్ వచ్చేసింది, ఇది వేసవి నాటి వేడి నుండి మీకు గొప్ప ఉపశమనం కల్పిస్తుండవచ్చు. అయితే వర్షాకాలం ఎన్నో ఆనందాలను అందించటంతో పాటుగా కొన్ని సవాళ్లను విసురురుంది. ప్రత్యేకించి సీజనల్ అనారోగ్య సమస్యలు, ట్రాఫిక్ కష్టాలు, విద్యుత్ సహా ఇతర అన్ని రకాల సేవలలో అంతరాయాలు, పొంగిపొర్లే కాలువలు, నీటితో నిండిపోయే రోడ్లు వాటి కారణంగా జరిగే ప్రమాదాలు ఇలా చాలా ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోకుండా ఈ సీజన్‌ను ఆస్వాదించాలనుకుంటే, మీకోసం ఇక్కడ కొన్ని భద్రతా చిట్కాలను అందిస్తున్నాం, మీరు వీటికి కట్టుబడి ఉండాలి.
మాన్‌సూన్ సేఫ్టీ చిట్కాలు
మాన్‌సూన్ సమయంలో బయటకు వెళ్లేటపుడు, ఆ సమయానికి ఉన్న వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి. అవసరమయ్యే అన్ని వస్తువులు అనగా గొడుగు, రెయిన్ కోట్, అదనపు దుస్తులు, అదనపు ఫోన్ ఛార్జర్ మొదలైనవి మీతో పాటు ఉంచుకోవాలి. అదనంగా మీరు కచ్చితంగా పాటించాల్సిన భద్రతా చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
వర్షంలో నడవడం మానుకోండి
వర్షాన్ని ఆస్వాదించడం ఉత్సాహం కలిగిస్తుంది, కానీ వర్షంలో తడవడం, నడవడం మీకు హానికారకం కావచ్చు. నడక ఆరోగ్యకరమే అయినా వర్షంలో నడవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది వర్షపు నీటితో మీ శరీరం ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. లెప్టోస్పిరోసిస్, పాదాలు, గోళ్లకు సంబంధించిన ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లతో పాటు వివిధ బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం ఉంది. మధుమేహ రోగులకు ఈ వాతావరణం మరింత ప్రమాదకరం.
సురక్షితంగా డ్రైవ్ చేయండి
తమ సొంత వాహనాలలో ప్రయాణించే వారు తమ డ్రైవింగ్ పై శ్రద్ధ వహించాలి. అన్ని ట్రాఫిక్ చట్టాలు, భద్రతా నియమాలకు కట్టుబడి ఉండాలి, ముఖ్యంగా వరదలు ఉన్న ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటపుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించండి. ఎందుకంటే వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు డ్రైవింగ్ చేసే ముందు మీరు తప్పనిసరిగా మీ వాహనంలోని ఇంధనం, బ్రేక్‌లు, టైర్లు, వైపర్‌లను తనిఖీ చేయాలి.
అదనపు దుస్తులు
రెయిన్ కోట్, గొడుగు మాత్రమే కాకుండా మీ బ్యాగులో ఒక అదనపు జత బట్టలు కూడా తీసుకెళ్లండి. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు కురుస్తాయో చెప్పలేము, దీంతో మీరు తడిగా మారవచ్చు, ఇది మీకు అనారోగ్య సమస్యలు, దురద సమస్యలను కలిగించవచ్చు. అలాగే రోడ్డుపై బురద చిల్లి ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి అదనపు జత దుస్తులు ఉండటం ఎంతకైనా మంచిదే.
కళ్ళు రుద్దడం మానుకోండి
వర్షాకాలంలో తరచుగా మీ కళ్ళు రుద్దడం మానుకోండి. ఇది కండ్లకలక, కంటి కురుపులు, పొడి కళ్ళు, కార్నియల్ అల్సర్ వంటి కంటి ఇన్ఫెక్షన్లను పెంచుతుంది. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అది కంటిచూపు నష్టానికి దారితీయవచ్చు. అందువల్ల, కళ్లల్లో చికాకు, ఎరుపు లేదా దురదను నివారించడానికి, మీ కళ్లను తాకకుండా ఉండండి. అలాగే ల్యాప్ టాప్, మొబైల్ మొదలైన స్క్రీన్‌లకి గురికాకుండా ఎక్స్పోజర్‌ను, బ్రైట్నెస్ ను తగ్గించాలనే ప్రాథమిక నియమాన్ని అనుసరించండి.
ఎమర్జెన్సీ కిట్
మీ ఎమర్జెన్సీ కిట్‌లో బ్యాటరీతో పనిచేసే లైట్, బ్యాండ్-ఎయిడ్స్, యాంటిసెప్టిక్స్, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే స్ప్రేలతో కూడిన ప్రథమ చికిత్స సామగ్రిని ఉంచుకోవాలి, అలాగే మీరు రోజువారీగా ఉపయోగించే అత్యవసర మందులను కూడా తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీ విలువైన గాడ్జెట్స్ ఇతర వస్తువులు వర్షం నీటికి తడవకుండా వాటర్‌ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఎల్లప్పుడూ ఉంచుకోండి.
చివరగా, ఈ వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, వేడిగా ఉన్న ఆహారాన్ని తినండి, తగినంత నీరు తాగండి. ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండండి.
సంబంధిత కథనం