Monday Motivation : జీవితంలో నిన్ను పైకి లేపాల్సింది ఇతరులు కాదు.. నువ్వే-monday motivation no one can help you push your self to achieve goal ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Monday Motivation No One Can Help You Push Your Self To Achieve Goal

Monday Motivation : జీవితంలో నిన్ను పైకి లేపాల్సింది ఇతరులు కాదు.. నువ్వే

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Monday Vibes : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూస్తే.. కాలం గడిచిపోతుంది. మీ జీవితానికి ఎవరూ సాయం చేయరు. మీకు మీరే సాయం చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పైకి లేపుకోవాలి. నిన్ను పైకి లేపే చేతుల కోసం చూడొద్దు. నీ చేతులనే ఉపయోగించుకోవాలి.

ఒకప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుపడాలని కోరుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. ఎవరి జీవితాన్ని సెట్ చేసుకునే పనిలో వారే ఉన్నారు. అవతలి వారికి సాయం చేయాలన్నా ఆలోచన కూడా తగ్గిపోయింది. పక్కింటి వాడు ఎలా ఉన్నాడనే ఆలోచన కూడా లేని రోజులు వచ్చేశాయి. ఇలాంటి రోజుల్లో మీకు ఎవరూ సాయం చేయరు. నీకు నువ్వే సాయం చేసుకోవాలి. నీ జీవితానికి నువ్వే కర్మ, కర్త, క్రియ. నువ్వు చేసే పనులు.. నిన్ను నిలబెట్టేలా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం. అలా అని పక్కవాళ్లు చెబుతారు కదా అని ఎదురు చూడొద్దు. నీ తప్పుల వల్ల పైకి లేవలేకపోతే.. నిన్ను లేపేవాళ్లు ఎవరూ ఉండరు. నువ్వే నెమ్మదిగా లేవాలి. ఒక చేయి సాయంతో మరో చేయిని పైకి లేపాలి. నీ కాళ్లను ముందుకు సాగేలా.. సాధన చేయాలి. అలా విజయం వైపు అడుగులు వేయాలి. లేదు ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అని వెయిట్ చేస్తే.. నిన్ను చేతకాని వాడిగా ముద్ర వేస్తుందీ ప్రపంచం.

మీ జీవితాన్ని ప్రపంచం జడ్జ్ చేయకముందే ముందుకు సాగాలి. ఎవరో వచ్చి మిమ్మల్మి మేలుకొల్పరు. మిమ్మల్ని మీరే.. తట్టి లేపాలి. నీ కళ్లతో ప్రపంచాన్ని సరిగా చూడాలి. వాటితోనే దారిని చూడాలి. ఎంత ముందుకు వెళ్లగలుగుతావో అంత ముందుకు వెళ్లాలి. మహా అయితే ఓడిపోతారు. మళ్లీ ప్రయత్నించాలి. అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఆశలతో ఉండే.. అడియాశలుగా మిగిలిపోతాయి.

ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గురించి అందరికంటే.. ఎక్కువగా మీరే ఆలోచిస్తారు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుండాలి. లేదంటే నిరాశలోకి వెళ్లిపోతారు. నీ గురించి కాసేపు ఆలోచించి.. వదిలేసే వాళ్లు ఉంటారు. కానీ ప్రతిక్షణం మీ గురించి మీరే ఆలోచించుకుంటారు. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదని ఫీల్ కావాల్సిన పని లేదు.

ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు నువ్వు సాయం చేసుకుని పైకి వెళ్తున్నప్పుడు.. నీకు దారిలో కనిపిస్తున్న వారికి ఎంతో కొంత సాయం చేయాలి. జీవితంలో అదొక్క విషయమే తృప్తినిస్తుంది.

కళ్లలో నీరు ఉప్పగా ఉన్నా.. కళ్లు కనే కలలు తియ్యగా ఉండాలి..

గుండెల్లో ఎంత బరువున్నా.. పెదవులలో చిరునవ్వు ఉండాలి..

చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా.. మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు పెంచేలా ఉండాలి..

పయణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా.. మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి..

WhatsApp channel