Mixed Fruit Tea | మిక్స్‌డ్ ఫ్రూట్ ఛాయ్.. తాగితే స్వర్గమే!
ఛాయ్ తాగారా ఫ్రెండ్స్.. ఇప్పుడు మీకోసం ఒక సరికొత్త ఛాయ్‌ని పరిచయం చేస్తున్నాం.. ఇలా ఛాయ్ చేసుకొని తాగితే మీకిక స్వర్గమే
ఛాయ్ ఎలా చేస్తారు? పాలు వేసి.. పొడి వేసి.. చక్కెర వేసి.. వేడి చేసి..నీకో సిప్పు, నాకో సిప్పు అన్నట్లుగా ఛాయ్ తయారు చేసే విధానం ఉండాలి. కానీ కొందరు ఛాయ్ వాలాలు డైరెక్టర్ ఎస్. ఎస్ రాజమౌళి లాగా తమ క్రియేటివిటీని అంతా రంగరించి కొత్తకొత్త ఛాయ్ రకాలను తయారు చేసి జనాల మీదకు వదులుతున్నారు. మొన్న రసగుల్లా ఛాయ్, ఆ తర్వాత పింక్ ఛాయ్, ఇప్పుడు మిక్స్‌డ్ ఫ్రూట్ ఛాయ్.
మిక్స్‌డ్ ఫ్రూట్ టీనా? మాకు మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్ తెలుసు, మిక్స్ చేసిన కాస్‌టేల్స్ తెలుసు కానీ ఈ మిక్స్‌డ్ ఫ్రూట్ ఛాయ్ ఎప్పుడు వినలేదు, కనలేదు.. అసలు ఆ ఛాయ్ ఎలా చేస్తారు ఈ ‘టీ’ అనుకుంటున్నారా? సో సింపుల్.
ముందుగా పాలు వేడి చేయాలి, ఆ తర్వాత ఛాయ్ పత్తి వేయాలి, ఆ తర్వాత ఒక అరటిపండును ముక్కలు చేసి వేయాలి, ఆ తర్వాత ఒక సపోట పండును పిసికి వేయాలి, ఆ తర్వాత ఒక యాపిల్ పండును తురిమి వేయాలి, ఆ తర్వాత ఒక అల్లం ముక్కను పరాపరా గీకి అందులో వేయాలి. మిక్స్‌డ్ ఫ్రూట్ ఛాయ్ రెడీ.. దీన్ని ఇప్పుడు ఒక కప్పులో వడకట్టి వేడివేడిగా తాగుతూ ఉంటే.. ఎలా ఉంటుందో తాగితే మీకే తెలుస్తుంది. రేపు మీ వార్త పేపర్లోనూ రావొచ్చు.
ఇదిగో చూడండి ఆ అద్భుత దృశ్యం.
Mixed Fruit Chai
ఇది గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో ఓ ఛాయ్ వాలా ఈ సరికొత్త టీని ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే ఈ మిక్స్‌డ్ ఛాయ్‌పై మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. నెటిజన్స్ కొంతమంది అబ్బో ఈ ఛాయ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని ఉందని కమెంట్స్ చేస్తుండగా.. ఇది ఛాయ్‌పై సామూహిక అత్యాచారం లాంటింది, ఛాయ్‌ని బతకనివ్వండి .. జనాలను బ్రతకనివ్వండి అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం ఆయుర్వేదం ప్రకారం అలా పండ్లను మిక్స్ చేసి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం