Microlino 2.0 । ఇది కార్ కాదు, కార్ లాంటిది.. ఈ బబుల్ EVలో విశేషాలు ఎన్నో!-microlino 2 0 bubble car enters into production know price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Microlino 2.0 Bubble Car Enters Into Production Know Price Details

Microlino 2.0 । ఇది కార్ కాదు, కార్ లాంటిది.. ఈ బబుల్ EVలో విశేషాలు ఎన్నో!

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 09:32 PM IST

ఇటలీకి చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్ అనే కంపెనీ Microlino 2.0 అనే అతిచిన్న బబుల్ కారును రూపొందించింది. బ్యాటరీ ఆధారంగా ఇది నడుస్తుంది. ఈ మైక్రోకార్ విశేషాలు తెలుసుకోటానికి ఈ స్టోరీ చదవండి.

Microlino 2.0
Microlino 2.0

ఇటీవల కాలంలో మైక్రోకార్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి చూడటానికి పరిమాణంలో చాలా చిన్నగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు రోజూవారీ అవసరాల కోసం చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో ఇప్పుడు సాంప్రదాయ ICE-ఇంజిన్ కోసం ఎక్కువ స్థలం అవసరం ఉండటం లేదు. చిన్న బ్యాటరీని అమర్చి దానిని మోటారుకు బిగిస్తే ఎలక్ట్రిక్ శక్తితో నడిచే వాహనం తయారవుతోంది. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ, మైక్రోకార్ కాన్సెప్టులతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా మైక్రోలినో అనే మైక్రోకార్ ఇప్పుడు స్విస్ దేశాల ప్రజలను ఆకర్షిస్తోంది. దీనిని పూర్తిగా కార్ అనడం కూడా సరికాదు నాలుగు చక్రాలుండే క్వాడ్రిసైకిల్ అనవచ్చు. ఈ బబుల్ కారును రూపొందించిన కంపెనీ కూడా దీనిని కార్ అనడం లేదు, కార్ లాంటిది అని చమత్కరిస్తోంది.

ఇటలీకి చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్ అనే కంపెనీ తొలుత మైక్రోలినో 1.0 అనే బబుల్ కారును రూపొందించింది కానీ ప్రొడక్షన్ చేయలేదు. అయితే ఇప్పుడు EV మార్కెట్ డిమాండ్ పెరగటంతో మైక్రోలినో 2.0 పేరుతో ప్రొడక్షన్ చేపడుతోంది. ఈ Microlino 2.0 చూడటానికి ఆధునిక BMW ఇసెట్టా లాగే కనిపిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే 30 వేలకు పైగా బుకింగ్‌లను పొందింది.

మైక్రోలినో 2.0 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

Microlino 2.0 అర్బన్, డోల్స్, కాంపిటీజియోన్ అనే మూడు సిరీస్ ప్రొడక్షన్ మోడల్‌లలో అందించనున్నారు. పరిమిత సంఖ్యలో పయనీర్ సిరీస్ అనే స్పెషల్ ఎడిషన్ కూడా అందించనున్నారు. అన్ని మోడల్స్ 17 hp శక్తిగల బ్యాటరీ అవుట్‌పుట్‌తో వస్తున్నాయి. ఈ బబుల్ కార్ కేవలం 5 సెకన్లలోనే 48 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 230 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

మైక్రోలినో బరువు కేవలం 535 కిలోలు మాత్రమే. దీనికి ఒకటే డోర్ ముందువైపు నుంచి పైకి లేపాల్సి ఉంటుంది. ఈ తేలికైన EVలో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా 230 లీటర్ల ట్రంక్ స్పేస్ ఉంటుంది. 

స్విట్జర్లాండ్‌లో మైక్రోలినో 2.0 ధర $ 15,340 గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 12 లక్షలు

కంపెనీ ఇటలీలోని టురిన్‌లోని తన సొంత ప్లాంట్‌లో మైక్రోలినో 2.0 ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ నుంచి ఏడాదికి 1500 యూనిట్లు తయారవుతున్నాయి. మున్ముందు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10,000 వాహనాలకు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్