Medicated Breakfast | ఆయుర్వేద బ్రేక్‌ఫాస్ట్.. వర్షాకాలంలో తప్పక తినాల్సిన అల్పాహారం ఇది!
Medicated Breakfast Recipe: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ఆయుర్వేద బ్రేక్‌ఫాస్ట్ కర్కిటక కంజి రెసిపీ (Karkitaka Kanji recipe) ని ఈ కింద చూడండి,
Monsoon Breakfast Recipes: భారతీయ పురాతన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం, మనం తినే ఆహారమే వివిధ రోగాలను దూరం చేసే ఔషధం అని సూచిస్తుంది. ఈ వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం, సీజనల్ ఫ్లూ వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆయుర్వేద నిపుణురాలైన డాక్టర్ రేఖ, ఈ వర్షాకాలం కోసం ఔషధ గుణాలు కలిగిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. "వర్షాకాలంలో మన శరీర బలం అలాగే అగ్ని (జీర్ణ అగ్ని) తక్కువగా ఉంటుంది, అన్ని దోషాలు సమతుల్యత కోల్పోతాయి. జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు ఎక్కువవుతాయి, మన శరీరం అనేక వ్యాధులకు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని చెప్పారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కర్కిటక కంజి రెసిపీని పంచుకున్నారు. ఇది అన్నం, కొన్ని ఔషధ మూలికలు కలిపి చేసే ఒక గంజి లాంటి వంటకం. దీనిని ప్రతిరోజూ ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగం, అలాగే గోరు వెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత ఒక నెల పాటు తినాలని డాక్టర్ రేఖ సూచించారు.
ఆయుర్వేద బ్రేక్‌ఫాస్ట్ కర్కిటక కంజి రెసిపీ (Karkitaka Kanji recipe) ని ఈ కింద చూడండి, ఇక్కడ ఇచ్చిన సూచనలు చదివి మీరు దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Medicated Breakfast Recipe కోసం కావలసినవి
- 100 గ్రాములు ఎర్ర బియ్యం (Navara red rice)
- 1 కప్పు తాజా కొబ్బరి పాలు
- 10 గ్రాముల దశపుష్ప చూర్ణం
- 5 గ్రాముల శొంఠి
- 5 గ్రాముల ధనియాలు
- 5 గ్రాముల వాము
- 5 గ్రాముల జీలకర్ర
- 5 గ్రాముల గార్డెన్ క్రెస్ సీడ్స్
- రుచికోసం బెల్లం లేదా రాక్ సాల్ట్
కర్కిటక కంజి తయారీ విధానం
- ముందుగా ఎర్రబియ్యాన్ని కడిగి 5 గంటలు నీటిలో నానబెట్టండి
- ఆ తర్వాత ఒక బాణాలిలో నీటిని మరిగించి, ఆ మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన బియ్యాన్ని వేయండి.
- ఇప్పుడు పైన సుగంధ దినుసులను వేయాలి, ఉడికించాలి. రుచికోసం బెల్లం లేదా రాక్ సాల్ట్ కలుపుకోవచ్చు.
- అన్నం ఉడికిన తర్వాత, కొబ్బరి పాలు పోసి కలపండి.
- చివరగా నెయ్యి, జీలకర్రను చల్లుకోండి.
అంతే, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన అల్పాహారం సిద్ధం. వేడిగా తింటూ ఆస్వాదించండి.
సంబంధిత కథనం