Antibiotic use: తరచూ యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా? ఈ స్టడీ ఫలితాలు తెలిస్తే షాకే-latest study reveals antibiotic use may increase risk of inflammatory bowel disease in people over 40 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Antibiotic Use: తరచూ యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా? ఈ స్టడీ ఫలితాలు తెలిస్తే షాకే

Antibiotic use: తరచూ యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా? ఈ స్టడీ ఫలితాలు తెలిస్తే షాకే

HT Telugu Desk HT Telugu

Antibiotic use: యాంటీబయాటిక్ వినియోగం వల్ల ఐబీడీ వంటి వ్యాధులు చుట్టుముడతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

యాంటీబయాటిక్ వినియోగం వల్ల ఐబీడీ సమస్య (ANI)

యాంటీబయాటిక్ వినియోగం 40 ఏళ్లు పైబడినవారిలో ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ ఇల్‌నెస్ (క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్) రిస్క్‌ను పెంచుతుందని జర్నల్ గట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. యాంటిబయాటిక్ వినియోగం వల్ల ఒకటి రెండేళ్లలో రిస్క్ పెరుగుతూ ఉంటుందని, గట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని కూడా తేల్చింది. పర్యావరణ కారకాలు కూడా ఈ ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)కి కారణమవుతాయని సర్వే తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, రానున్న దశాబ్దకాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తేల్చింది.

నేషనల్ మెడికల్ డేటా నుంచి 2000 - 2018 మధ్య గల ఐబీడీ పేషెంట్ల వివరాలు సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. దాదాపు 61 లక్షల మంది డేటా నుంచి ఈ అధ్యయనం చేశారు. వీరిలో సగం మంది మహిళలు కూడా ఉన్నారు. కనీసం ఒక్కసారైనా యాంటీబయాటిక్స్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ కాలంలో 36,017 మందిలో అల్సరేటివ్ కొలైటిస్, 16,881 మందిలో క్రాన్స్ డిసీజ్ ఉన్నట్టు వెల్లడైంది.

మొత్తంగా చూస్తే యాంటిబయాటిక్ వినియోగించని వారితో పోల్చితే వినియోగించిన వారిలో ఐబీడీ ముప్పు ఎక్కువగా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా రిస్క్ అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది.

10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో ఐబీడీ ఉండేందుకు 28 శాతం ఎక్కువ ముప్పు ఉందని, 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో 48 శాతం ఎక్కువ ముప్పు ఉందని అధ్యయనం తేల్చింది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు 47 శాతం ఉందని తేల్చింది.

అల్సరేటివ్ కొలైటిస్ కంటే క్రాన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని, 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతం, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 62 శతం, 60 పైబడిన వారిలో ఈ రిస్క్ 51 శాతం ఉందని అధ్యయనం తేల్చింది.

ఈ రిస్క్ క్యుములేటివ్‌గా ఉందని, అంటే యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నప్పుడల్లా ఆ రిస్క్ అదనంగా వయస్సును బట్టి 11 శాతం, 15 శాతం , 14 శాతం పెరిగిందని స్టడీ తేల్చింది.

యాంటిబయాటిక్స్ ఐదు సార్లు, లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రిస్క్రిప్షన్ పొందిన వారిలో రిస్క్ తీవ్రంగా ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది. 10 నుంచి 40 ఏళ్ల మధ్యలో 69 శాతం అధికంగా, 60 ఏళ్లు పైబడిన వారిలో 95 శాతం అధికంగా రిస్క్ ఉన్నట్టు గుర్తించింది.

అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనమని, కారణాన్ని నిర్ధారించలేమని అధ్యయనం తెలిపింది. పేషెంట్లు ఏయే యాంటిబయాటిక్స్ తీసుకున్నారు? వాస్తవ వినియోగం ఎంత వంటి సమాచారం అందుబాటులో లేదని వివరించారు.

అయితే యాంటిబయాటిక్స్ పరిమితం చేయడం వల్ల వాటి నిరోధకతను అరికట్టడమే కాకుండా, ఐబీడీ రిస్క్ తగ్గించగలదని అధ్యయనం వివరించింది.