Winter Nut Pista: పిస్తాలని ‘వింటర్ నట్స్’ అంటారు.. ఎందుకో తెలుసా?
Winter Nut Pista: చలికాలంలో పిస్తా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. దాన్ని వింటర్ నట్ అని ఎందుకంటారో, దానిలో ఉండే పోషకాలేంటో తెలుసుకొండి.
పిస్తా లాభాలు (freepik)
ఆరోగ్యం కోసం, తక్షణ శక్తి కోసం డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో చేర్చుకుంటాం. ఖర్జూరం, బాదాం, కిస్‌మిస్, జీడిపప్పు, పిస్తా.. లాంటి డ్రై ఫ్రూట్స్‌ని రోజూ తినడానికి ప్రయత్నిస్తాం. అయితే వీటిలో పిస్తాను ప్రత్యేకంగా శీతాకాలపు నట్‌గా ఆహార నిపుణులు చెబుతుంటారు. అదెందుకో తెలుసుకోండి.
వింటర్ నట్ పిస్తా:
- శీతాకాలంలో ఆహారంలో భాగంగా తీసుకోవడానికి పిస్తా మంచి ఆప్షన్ అని చెబుతారు. ఎందుకంటే మిగిలిన గింజలతో పోలిస్తే దీనిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. దీనిలో ఫోలేట్, విటమిన్ బీ6, సీ, ఈలు లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా పొడి చర్మం, దురదల్లాంటి చర్మ సమస్యలు వస్తుంటాయి కదా. అలాంటి వాటి నుంచి చర్మాన్ని ఇవి రక్షిస్తాయి.
- పిస్తాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత అవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. అంటే శీతాకాలంలో బయట చల్లటి వాతావరణం ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఒంట్లో వేడి ఉత్పత్తి అయితే శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యతతో ఉంటాయి. అంటే బయటి చల్లదనం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనం లోపలి నుంచి వేడిగా ఉండేలా చేస్తాయి. అందువల్ల మనకు చలితో సమస్యగా అనిపించదు.
- ఇవి మనలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. దీనిలో ఉన్న విటమిన్ బీ6 వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో సహజంగా వచ్చే దగ్గు, జలుబు లాంటి వ్యాధులకు పిస్తాను తినడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
- దీనిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి శక్తి ఒక్కసారే విడుదల అయిపోకుండా క్రమ క్రమంగా విడుదల అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు తిన్న చాలా సేపటి వరకు నీరసమనేదే రాదు. అలాగే చాలా సేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అందువల్ల ఇంకేవో ఎక్కువగా తినకుండా ఉంటాం. బరువు తగ్గే అవకాశాలూ ఉంటాయి.
- వీటిలో మంచి కొలస్ట్రాల్ ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు దరి చేరవు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శీతాకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
- బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు మన మెదడు కూడా ఉత్సాహంగా ఉండదు. నెమ్మదిగా ఉంటుంది. అయితే పిస్తా తినడం వల్ల ఈ కాలంలోనూ మెదడు మెరుగైన పని తీరును ప్రదర్శిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.