Natural Sunscreen Foods: ఈ ఆహారాలు తింటే సన్‌ స్క్రీన్‌ రాసుకున్నట్లే.. ట్యానింగ్ సమస్యే ఉండదు..-know some few foods which acts as natural sunscreens ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Sunscreen Foods: ఈ ఆహారాలు తింటే సన్‌ స్క్రీన్‌ రాసుకున్నట్లే.. ట్యానింగ్ సమస్యే ఉండదు..

Natural Sunscreen Foods: ఈ ఆహారాలు తింటే సన్‌ స్క్రీన్‌ రాసుకున్నట్లే.. ట్యానింగ్ సమస్యే ఉండదు..

Koutik Pranaya Sree HT Telugu
Nov 28, 2023 09:00 AM IST

Natural Sunscreen Foods: కొన్ని ఆహారాలు తింటే సన్‌స్క్రీన్ రాసుకున్నంత మేలు జరుగుతుంది. వాటిని రోజూవారీ డైట్ లో చేర్చుకుంటే సన్ ట్యానింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో చూసేయండి.

సన్‌స్క్రీన్‌లా పనిచేసే ఆహారాలు
సన్‌స్క్రీన్‌లా పనిచేసే ఆహారాలు (freepik)

ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలని అంతా కోరుకుంటారు. అలా ఉండేందుకు ఎండలోకి వెళ్లినప్పుడు కచ్చితంగా సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం అనేది తప్పనిసరి. లేదంటే ఎండలో ఉండే అతినీల లోహిత కిరణాల తాకిడికి చర్మం ప్రభావితం అవుతుంది. అందువల్ల ట్యానింగ్‌ వచ్చేస్తుంది. చర్మం కమిలి నల్లగా అయినట్లుగా అయి కాంతి విహీనంగా తయారవుతుంది. అయితే చాలా మందికి సన్‌ స్క్రీన్ లోషన్‌ని రాసుకునే అలవాటే ఉండదు. అలాంటి వారు కొన్ని ఆహారాలను తినడం ద్వారా చర్మాన్ని ట్యానింగ్‌ నుంచి దూరం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలు ఏమిటంటే..

కొబ్బరి నీళ్లు:

వీలైనప్పుడల్లా కొబ్బరి బొండం నీటిని తాగుతూ ఉండటం వల్ల ఎన్నో చర్మ ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని సహజ మాయిశ్చరైజర్‌ అని చెబుతారు. ఇది చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. మలినాలను తొలగించి స్కిన్‌ టోన్‌ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. సన్‌ స్క్రీన్‌లాగానూ పని చేస్తుంది.

గ్రీన్‌ టీ:

ఇటీవల కాలంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది గ్రీన్‌ టీని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో పాలీఫెనాళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యుడి ప్రతికూల ప్రభావాలను చర్మంపై పడకుండా కట్టడి చేస్తాయి. సహజ సన్‌స్క్రీన్‌లా ఉపయోగపడతాయి.

నిమ్మ రసం:

నిమ్మ కాయలో విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎండ ప్రభావాన్ని చర్మంపై ఎక్కువగా పడకుండా చూస్తాయి. అందువల్ల యూవీ కిరణాల ప్రభావాన్ని మనకు దూరం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌ వల్ల చర్మం దెబ్బ తినకుండా చూస్తాయి. కాబట్టి వీలైతే రోజూ కాస్త నిమ్మకాయ నీటిని తాగుతూ ఉండటం వల్ల చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది.

టమాటా:

సహజమైన సన్‌ స్క్రీన్‌లా పని చేసే లక్షణాలు టమాటాలో పుష్కలంగా ఉన్నాయి. దీనిలో లైకోపీన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. యూవీయే, యూవీబీ కిరణాల రేడియేషన్‌ల నుంచి ఇది చర్మాన్ని కాపాడుతుంది. సన్‌ బర్న్‌ కాకుండా చూస్తుంది. టమోటాను తినడం, చర్మానికి పూసుకోవడం వల్ల ఎండ సంబంధిత సమస్యలు అన్నింటి నుంచి అది మనకు రక్షణ కల్పిస్తుంది.

పెరుగు :

హానికరమైన సూర్య కిరణాల తాకిడి నుంచి చర్మాన్ని రక్షించడంలో పెరుగు, మజ్జిగ లాంటివి సమర్థవంతంగా సహాయపడతాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చూస్తాయి. తద్వారా ముందస్తు వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. రోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

Whats_app_banner