Excessive Sweating | మీకు ఎక్కువగా చెమటపడుతుందా? ఆ సమస్యకు కారణాలు ఇవే!
చెమటపట్టడం అనేది చాలా సహజం. శరీరంలో వేడి జనించినపుడు దానిని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా చెమటపడుతుంది. అయితే కొందరికి సాధారణం కంటే అధికంగా చెమట పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణాలు ఇక్కడ తెలుసుకోండి..
చెమటలు అందరికీ పడతాయి, అది సహజం. చెమట కలగడానికి గల కారణాలను పరిశీలిస్తే ఎక్కువ శ్రమించినపుడు, వ్యాయామాలు చేసినపుడు అలాగే వేడి వాతావరణంలో ఉన్నప్పుడు సాధారణంగా చెమటలు పడుతుంటాయి. కొన్నిసార్లు భయాందోళనలకు లోనయినపుడు, నాడీవ్యవస్థ ఉత్తేజితం అయినపుడు కూడా చెమటలు పడతాయి. అయితే చెమట అందరికీ ఒకేరీతిలో కలగదు. కొంతమందికి సాధారణం కంటే కూడా అధికంగా చెమటలు పడతాయి. ఈ పరిస్థితిని 'హైపర్ హైడ్రోసిస్' అని పిలుస్తారు.
అధిక చెమట కొన్ని రకాల అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. హైపోథైరాయిడిజం, ఒబేసిటీ, హార్ట్ ఎటాక్ లక్షణాలు, డయాబెటీస్ ఉన్నప్పుడు, హైబీపీ, లోబీపి, కొన్ని రకాల ఔషధాల వాడకం, గాయాలు అయినపుడు, ఇన్ఫెక్షన్లు సోకినపుడు ఆడివారికి ప్రెగ్నెన్సీ సమయంలో లేదా మెనోపాజ్ ఉన్నప్పుడు చెమటలు పడతాయి.
ఈరోజుల్లో చాలామందికి ఒబెసిటీ పెరిగిపోతుంది. BMI 30 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒబెసిటీ ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఎక్కువ బరువు ఉంటే శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఆ శక్తి ఖర్చు అయినపుడు ఉష్ణం జనిస్తుంది. దాని ఉప-ఉత్పత్తి చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఈ విధంగా శరీర ఉష్ణోగ్రత చల్లబరిచే ప్రక్రియ జరుగుతుంది. అధిక బరువు శారీరక శ్రమ తక్కువ ఉండటం వలన ఏర్పడుతుంది. కాబట్టి వారికి కొద్దిపాటి శారీరక శ్రమ కలిగినా చెమట అధికంగా బయటకు వస్తుంది. ఇలాంటి వారు తమ బరువును నియంత్రించుకోగలిగితే చెమట సమస్యను అధిగమించవచ్చు.
ఇక మిగతా ఆరోగ్య సంబంధమైన కారణాలకు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.
అలాగే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా అధిక చెమటను అదుపులో ఉంచవచ్చు.
ఇంట్లో అధిక చెమటను తగ్గించుకునేందుకు చిట్కాలు
చల్లని రూమ్‌లో నిద్రించండి:
గదిని చల్లబరుచుకోవడం, చల్లటి గదిలో ఉండటం చేయాలి. అలాగే తేలికైన పరుపులు, బ్లాంకెట్లను వినియోగించాలి.
దుస్తుల ఎంపిక:
సహజమైన ఫైబర్‌లతో తయారు చేసిన దుస్తులు, తేలికైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోండి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి తేమను దూరం చేస్తుంది.
ఆహారాలు:
ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు, సిగరెట్లు తాగటం, ఆల్కహాల్ సేవించడం వంటివి చెమట సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
చల్లని దిండు:
కొన్ని దిండ్లలో ఉండే మెటీరియల్ చెమట ఎక్కువ పట్టేందుకు కారణమవుతుంది. కాబట్టి దిండుకింద చల్లటి ఐస్ ప్యాక్ ఉంచుకోవడం. మరోవైపు దిండును మార్చడం లాంటివి చేస్తే ఫలితం ఉంటుంది.
సంబంధిత కథనం