Know about sea weed: సముద్ర నాచు అంటే ఏమిటి? దాన్ని తింటే ఏమౌతుందో తెలుసా?
Know about sea weed: సముద్రపు నాచును రెస్టారెంట్లలో కొన్ని రకాల ఫ్యాన్సీ ఆహారాల్లో వాడటం ఈ మధ్య చూస్తున్నాం. అయితే దాన్ని తింటే ఏమవుతుంది, ఏమైనా ప్రయోజనాలున్నాయో లేదో చూడండి.
సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో సముద్రపు నాచును తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో దీన్ని వేసుకుని తాగుతారు. సాంప్రదాయ వైద్యాల్లోనూ మందుగా వాడే అలవాటు ఉంది. కొన్ని దేశాల సాంప్రదాయ వంటల్లోనూ దీన్ని చుట్టుకొని తింటారు. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే దీన్ని తినడం వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతోంది. అందువల్ల దీన్ని తినడం ఇక్కడ ఈ మధ్య కాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి దీనిలో ఉండే పోషకాలు ఏమిటి? తింటే ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఎక్కువగా తింటే ఏమైనా ప్రమాదమా? లాంటి ప్రశ్నలన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకోండి.
సముద్రపు నాచు ఉపయోగాలు :
ఒక గ్రాము సముద్రపు నాచును రోజు వారీ మన ఆహారంలో తీసుకున్నప్పుడు అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఇతర సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయి. దీంట్లో విటమిన్ సీ, బీలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు :
- సముద్రపు నాచు శరీరంలో ఎంతో కీలకమైన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం శరీర ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
- జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.
- ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలకు చెక్ పెడుతుంది.
- థైరాయిడ్ ఉన్న వారికి ఇది మందులా పని చేస్తుంది.
- అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
- దీనిలో ఉన్న యాంటీ వైరల్ లక్షణాల వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది.
- లైంగిక సంబంధమైన ఎన్నో సమస్యలకు మందుగా పనికొస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలకూ పరిష్కారం చూపుతుంది.
- తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చూస్తుంది.
- దీనిలో ఉండే అయోడిన్ స్థాయిల వల్ల ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఈ మధ్య కాలంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది.
ఎక్కువ తింటే ప్రమాదమా?
అతి అనర్థం అనే మాటను అంతా గుర్తుంచుకోవాలి. దేన్నైనా తగిన మోతాదులో తిన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించిన మంచి ఫలితాలు ఆరోగ్యంపైన ఉంటాయి. సముద్రపు నాచులో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ గ్రంధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్, థైరాయిడ్ క్యాన్సర్లు రావచ్చు. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, డయేరియా లాంటివీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి దీన్ని ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీఐ సర్టిఫై చేసిన సీవీడ్ ప్యాక్‌లను మాత్రమే కొనుక్కోవాలని చెబుతున్నారు. సరిగ్గా ప్రోసెస్ చేయని సముద్రపు నాచులో అల్యూమినియం, కాడ్మియంలాంటి లోహాలు ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి నాణ్యమైనదాన్ని ఎంపిక చేసుకోవడమూ ముఖ్యం.