Brain Exercises: ఈ పనులు చేస్తే మెదడుకు వ్యాయాయం చేసినట్లే..
Brain Exercises: శరీరానికే కాదూ.. మెదడుకూ వ్యాయామం అవసరమే. అప్పుడే అది చురుగ్గా ఉంటుంది. మీ మెదడు పదును పెంచే పనులేంటో చూడండి.
మెదడు మన శరీరంలోని అవయవాలన్నింటి బాస్ అని చెప్పవచ్చు. ఇది తన ఆజ్ఞల ద్వారా శరీరంలో ఎప్పుడు ఏమేమి జరగాలో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. మన శరీరంలో అసంకల్పితంగా జరిగే ఊపిరి పీల్చుకోవడం, గుండె కొట్టుకోవడం లాంటి పనులన్నింటినీ ఇది నియంత్రిస్తుంది. అలాగే స్త్రీ పురుషుల్లో దీని నిర్మాణం వేరుగా ఉండటం వల్ల దీని సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి. పురుషులకు జ్ఞాపక శక్తి కంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. మరి ఎవరికైనా సరే మెదడు పని తీరు తగ్గితే మతిమరుపు, తెలివిగా ఉండలేకపోవడం, అసంకల్పితంగా జరిగే పనుల్లో ఇబ్బందులు తలెత్తడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం. మనం ఏమేం చేయడం వల్ల దీనికి అవి వ్యాయామంగా ఉపయోగపడతాయో ఇక్కడ చూసేద్దాం.
లెక్కలు చేయండి :
ఎక్కడైనా రోజు వారీ పనుల్లో లెక్కలు చూడాల్సి వచ్చినప్పుడు మెదడులో లెక్కలు చేసేందుకు ప్రయత్నించండి. పెన్ను, పేపరు, కాలిక్యులేటర్ లాంటి వాటి సహాయం తీసుకోకుండా లోపలే ఈ పని చేయడం అనే దాన్ని అలవాటు చేసుకోండి. ఇది బ్రెయిన్‌కి ఎక్సర్‌సైజ్‌లా పని చేస్తుంది. అలాగే చదరంగం లాంటి ఆలోచనా శక్తి పెంచే ఆటలు ఆడటం చాలా మేలు చేస్తుంది.
కొత్త భాష నేర్చుకోండి :
కొత్త భాషల్ని నేర్చుకోవడం అనేది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పని చేయడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుందని 2020లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఏదో ఒక కొత్త భాషను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం వల్ల మెదడుకు మేలు జరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
జాబితా గుర్తుంచుకోండి :
కొందరు బజారు నుంచి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే వాటన్నింటితో ఓ జాబితా రాసుకుని ఆ చీటీ పట్టుకుని మార్కెట్‌కి వెళతారు. అయితే మెదడును పదునుగా ఉంచుకోవాలంటే ఈ జాబితా అంతటినీ గుర్తుంచుకుని దుకాణానికి వెళ్లండి. అక్కడ వీటన్నింటినీ తిరిగి గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఇలా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.
రుచులను గుర్తించండి :
ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు రకరకాల ఆహార పదార్థాలను తింటుంటాం కదా. వాటిలో ఏమేం పదార్థాలు వాడారో గుర్తించేందుకు ప్రయత్నించండి. వీటిలో వాడిన మసాలాలు, తాలింపులు సహా వీలైనన్ని ఎక్కువ పదార్థాలను గుర్తించండి. అప్పుడు మీ రుచి మొగ్గలు మరింత చురుగ్గా తయారవుతాయి.
చేయి, దృష్టి రెండింటితో అయ్యే పనులు చేయండి :
హ్యాండ్, ఐ కోర్టినేషన్‌తో చేసే పనులను చేయండి. లేసులు అల్లడం, రాయడం, బొమ్మలు వేయడం, పెయింటింగ్‌లు చేయడం, వీడియో గేమ్‌లు ఆడటం లాంటి వాటి వల్ల మెదడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. తద్వారా దాని పని తీరు మెరుగవుతుంది.