Instant Sambar Powder: ఇన్‌స్టెంట్ సాంబార్ పొడిని తయారు చేసి పెట్టుకుంటే, అప్పటికప్పుడు సాంబార్ వండేసుకోవచ్చు-instant sambar powder recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Sambar Powder: ఇన్‌స్టెంట్ సాంబార్ పొడిని తయారు చేసి పెట్టుకుంటే, అప్పటికప్పుడు సాంబార్ వండేసుకోవచ్చు

Instant Sambar Powder: ఇన్‌స్టెంట్ సాంబార్ పొడిని తయారు చేసి పెట్టుకుంటే, అప్పటికప్పుడు సాంబార్ వండేసుకోవచ్చు

Haritha Chappa HT Telugu
Dec 31, 2023 11:30 AM IST

Instant Sambar Powder: సాంబార్ అంటే ఎంతో మందికి ఇష్టం. ఇలా సాంబర్ పొడి చేసుకుంటే పదినిమిషాల్లో వండేసుకోవచ్చు.

ఇన్‌స్టెంట్ సాంబార్ పొడి
ఇన్‌స్టెంట్ సాంబార్ పొడి (Pixabay)

Instant Sambar Powder: సాంబార్ వండాలంటే ముందుగా పప్పు నానబెట్టడం, ఉడకబెట్టడం వంటివి చేసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా అప్పటికప్పుడు సాంబారు చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. ఇన్ స్టెంట్ సాంబార్ పొడిని తయారుచేసి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసుకోవచ్చు. ఈ పొడిని నీళ్లలో మరిగించుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్‌స్టెంట్ సాంబార్ పొడి తయారీ ఎలాగంటే...

ఇన్‌‌‌స్టెంట్ సాంబార్ పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కంది పప్పు - ఒక కప్పు

పచ్చి శనగపప్పు - ముప్పావు కప్పు

మినప్పప్పు - అర కప్పు

పెసరపప్పు - అర కప్పు

ఎండుమిర్చి - 25

మిరియాలు - ఒక స్పూను

మెంతులు - ఒక స్పూన్

జీలకర్ర - ఒక స్పూన్

ధనియాలు - అరకప్పు

కరివేపాకు - ఒక కప్పు

చింతపండు - 100 గ్రాములు

ఇంగువ - ఒక స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - 6

ఉప్పు - రుచికి సరిపడా

కొబ్బరి పొడి - ఒక కప్పు

సాంబార్ పొడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట మీద కందిపప్పును వేయించుకోవాలి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. అలా పెసర పప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, మిరపకాయలు, కరివేపాకులు వంటివన్నీ వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో పప్పులు వేసి...లవంగం, దాల్చిన చెక్క, చింతపండు, కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి.

5. అంతే ఇన్ స్టెంట్ సాంబార్ పొడి రెడీ అయినట్టే.

6. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లోకి వేసి మూత పెట్టి సాధారణ ఫ్రిజ్లో నిలువ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.

సాంబార్ వండుకునేందుకు కావలసిన కూరగాయలను ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. టమోటో ముక్కల్ని, ములక్కాడలను వేసి మగ్గనివ్వాలి. ఒక టీ స్పూన్ పసుపును కూడా వేయాలి. అన్నీ బాగా మగ్గాక ఒక కప్పు ఇన్ స్టెంట్ సాంబార్ పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు సాంబార్‌కు కావాల్సినంత నీళ్లను వేసి ఉడికించాలి. ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. పది నిమిషాలు ఉడికిస్తే సాంబార్ సిద్ధమైపోతుంది.

Whats_app_banner