Coorg Summer Tour : హైదరాబాద్ టూ కూర్గ్.. వేసవిలోనూ వేడి నీటితో స్నానం చేసేంత చలి-hyderabad to coorg travel guidance must visit madikeri in summer for best experience ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coorg Summer Tour : హైదరాబాద్ టూ కూర్గ్.. వేసవిలోనూ వేడి నీటితో స్నానం చేసేంత చలి

Coorg Summer Tour : హైదరాబాద్ టూ కూర్గ్.. వేసవిలోనూ వేడి నీటితో స్నానం చేసేంత చలి

Anand Sai HT Telugu
Apr 17, 2024 08:04 AM IST

Madikeri Tour Details : ఈ వేసవిలో చల్లని ప్రదేశాలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి ప్రదేశమే.. కర్ణాటకలోని కూర్గ్. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళ్తే మీకు మంచి అనుభూతి లభిస్తుంది.

కూర్గ్ టూర్
కూర్గ్ టూర్

కర్ణాటకలోని కొడగు జిల్లాలోని కూర్గ్.. దీనినే మడికేరి అని కూడా అంటారు. వేసవిలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల పంటలు.. చల్లని వాతావరణం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. వేసవిలోనూ ఇక్కడ పొగమంచుతో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చలి కూడా ఎక్కువే ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కూర్గ్‌కు దగ్గరలోనే కావేరి నది జన్మస్థలం ఉంటుంది. చుట్టు కొండలు.. మధ్యలో కావేరి నది పుట్టినిల్లు. చూసేందుకు రెండు కనులు కూడా చాలవు అంటే నమ్మండి. హైదరాబాద్ నుంచి కూడా మీరు నేరుగా వెళ్లవచ్చు. 800 కిలో మీటర్లపైన వస్తుంది. అయితే మీరు మంగళూరు వెళ్లి అక్కడ నుంచి మడికేరి వెళితే ఇంకా బెటర్. ఎందుకంటే మంగళూరులోని చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కెఎస్ఆర్టీసీ అంబరీ బస్సులో మీరు వెళ్లవచ్చు. రోజూ సాయంత్రం 5.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు ఉంటంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు మంగళూరు చేరుతారు. అక్కడ నుంచి బస్సులో కూర్గ్ వెళ్లవచ్చు. లేదంటే మంగళూరులో స్టే చేసి.. కావాల్సిన ప్రదేశాలు చూసి.. బయల్దేరవచ్చు.

ట్రెక్కింగ్ చేయెుచ్చు

కూర్గ్ కొడగు కొండల్లో అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడ నుంచి మీరు మైసూర్ కూడా వెళ్లవచ్చు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ బోటింగ్, రుచికరమైన ఫుడ్, హోం మేడ్ వైన్, సుగంధ ద్రవ్యాలు.. ఇలా చాలానే ఇక్కడి ప్రత్యేకత. ఇక కాఫీ తోటలకు అయితే లెక్కే లేదు. కూర్గ్‌లో ట్రెక్కింగ్ చేయడానికి అనేక అద్భుతమైన శిఖరాలు ఉన్నాయి. ముఖ్యంగా తడియాండమోల్, బ్రహ్మగిరి, కుమారపర్వత కొండ ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానాలు.

తడియాండమోల్ కూర్గ్‌లోని ఎత్తైన శిఖరం. పచ్చదనంతో అందమైన ప్రకృతి దృశ్యాలతో ఈ శిఖరంపై ట్రెక్కింగ్ సులభం. మొదటిసారి ట్రెక్కింగ్ చేసేవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఈజీగా దీనిని ఎక్కవచ్చు. సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో బ్రహ్మగిరి ఉంటుంది. కూర్గ్, వాయనాడ్ జిల్లాల సరిహద్దులో పశ్చిమ కనుమల శ్రేణిలో భాగం ఇది. ట్రెక్కింగ్ చేయడం కొంత కష్టంగా భావించే ఈ ప్రదేశాన్ని అనుభవజ్ఞులైనవారు సందర్శిస్తారు. కూర్గ్‌లోని రెండో ఎత్తైన శిఖరం కుమార పర్వత కొండ. చాలా కష్టతరమైన మార్గం గుండా 14కిమీల ట్రెక్కింగ్ చేయాలి.

హోమ్ స్టే చేయండి

కూర్గ్ దక్షిణ భారతదేశంలో రాఫ్టింగ్ సాహసానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. కూర్గ్‌ను సందర్శించినప్పుడు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, హోటళ్లలో బస చేయకుండా హోమ్‌స్టేలలో ఉండడం. నిజమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఎందుకంటే.. కాఫీ తోటల మధ్యలో హోమ్ స్టేలు ఎక్కువగా ఉంటాయి. మీకు నైట్ క్యాంపులకు కూడా అనుమతి ఉంటుంది. కూర్గ్‌లో చాలా హోమ్ స్టేలు ఉన్నాయి.

కాఫీ తోటలు

కూర్గ్ నుండి 23 కి.మీ దూరంలో, దట్టమైన కాఫీ మరియు ఏలకుల తోటల గుండా వెళుతున్న ఇరుకైన మార్గం చివరలో అకస్మాత్తుగా కనిపించే అబ్బే జలపాతం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. పర్యాటకులు ఈ జలపాతాన్ని చూసి ఆనందించడానికి వీలుగా జలపాతం సమీపంలో ఒక వేలాడే వంతెనను నిర్మించారు. ప్రమాదకరమైన ప్రాంతం కావడంతో ఇక్కడ స్నానాలు చేసేందుకు పర్యాటకులకు అనుమతి లేదు.

రాజా సీట్ వెళ్లాల్సిందే

మడికేరి వెళ్లారంటే.. కచ్చితంగా రాజా సీట్ వెళ్లాల్సిందే. అయితే దీనిని సందర్శించేందుకు సాయంత్రంపూట వెళ్లండి. లోయకు పక్కనే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు.. పొగమంచు అలా మన ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. వాతావరణం వేసవిలోనూ చల్లగా ఉంటుంది. మన కాళ్ల కింద లోయ ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.

కావేరి నది జన్మస్థలం

కూర్గ్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం తల కావేరి. మడికేరికి 48 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి కొండపై ఉన్న ఈ ప్రదేశం నుండి కావేరి నది ఉద్భవించింది. దానికి గుర్తుగా పక్కనే దేవాలయం ఉన్నాయి. అయితే ఈ ప్రదేశానికి వెళ్తుంటే ప్రకృతి మిమ్మల్ని రారమ్మని పిలుస్తుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మార్గమధ్యంలో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. సుగంధ ద్రవ్యాలు, కాఫీ పొడులతోపాటుగా ఇతర వస్తువులు దొరుకుతాయి. మడికేరి నుంచి కావేరి నది జన్మస్థలానికి వెళ్లడం మంచి అనుభవం.

WhatsApp channel