Dancing Plague: ఆగకుండా డాన్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వందమంది, ఇదొక వింత వ్యాధి లక్షణం
Dancing Plague: డాన్సింగ్ ప్లేగ్... ఇదొక అరుదైన వ్యాధి. ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం. అలా చేస్తూ చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోతారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘటన.
Dancing Plague: ఎన్నో వింత వ్యాధుల గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు. అయితే 500 ఏళ్ల క్రితం ఒక వింత వ్యాధి మానవాళిపై దాడి చేసింది. అది ఎంత వింతైనది అంటే... దానికి ఎలాంటి చికిత్స లేదు. ఆగకుండా డాన్స్ చేయడమే ఆ వింత వ్యాధి లక్షణం. అందుకే దానికి డాన్సింగ్ ప్లేగ్ అని పేరు పెట్టారు. దాదాపు 100 మంది ఇలా డాన్సింగ్ ప్లేగు వల్ల నాట్యం చేస్తూనే అలసిపోయి మరణించారు. ఆ సంఘటన ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది.
ఈ వ్యాధి లక్షణాలు
ఈ డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ అనే నగరంలో సోకింది. 1518లో జూలై నెలలో ఈ వింత వ్యాధి ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపిస్తూ పోయింది. మొదటగా ఒక మహిళకు ఈ వ్యాధి సోకినట్టు చెబుతారు. ఆమె ఆ వ్యాధి సోకాక ఒంటరిగా రోడ్డుపై డ్యాన్స్ చేసుకుంటూ కనిపించింది. మొదట్లో ఆమెను చూసి పిచ్చిదని అందరూ నవ్వుకున్నారు. ఆమె తన ఇంటికి వెళ్ళాక కూడా అదే పనిగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది.
ఒక వారం తర్వాత మరో ముగ్గురికి ఈ వ్యాధి సోకింది. వారు కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నగరంలో ఉండే దాదాపు 400 మందికి ఈ వ్యాధి సోకింది. వారంతా కూడా రోడ్లపైకి చేరి డాన్సులు చేయడం మొదలుపెట్టారు. వారికి నిజానికి నాట్యం రాదు. పూనకం వచ్చినట్టుగా ఊగడమే. వారు చేసే డాన్స్ వారికి ఇష్టం లేకపోయినా కూడా ఈ వ్యాధి వల్ల అలా డాన్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి శరీరం నీరసించిపోయి, డిహైడ్రేషన్ సమస్య బారిన పడి, ఎంతోమంది అవయవాలు ఫెయిల్ అయ్యి మరణించారు. దాదాపు 100 మంది దాకా ఇలా మరణించినట్టు చరిత్రకారులు చెబుతారు.
డాన్స్ చేస్తున్న వారికి ఇలా చికిత్స చేయాలో తెలియక వైద్యుల కూడా చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వాధికారులు వారందరినీ ఒక పెద్ద గదిలో బంధించారు. ఆ గదిలో డాన్స్ చేస్తూ చేస్తూ ఎంతో మంది విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. కొంతమంది మానసిక వికలాంగులుగా మారారు.
మొదట్లో ఇలా డాన్స్ చేయడం చూసి దెయ్యం పట్టిందని అనుకున్నారు. కానీ అది ఒక వ్యాధి అని చివరికి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఆ వ్యాధి అంతు తేల్చ లేకపోయారు వైద్యులు. ఆ వ్యాధి ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చిందో? ఎలా ప్రజలకు సోకుతుందో కూడా తెలుసుకోలేకపోయారు. అయితే వారు తినే ఆహారంపై కొన్ని పరిశోధనలు చేశారు.
అప్పట్లో ఆ ప్రజలంతా వారు ‘రై పిండి’తో చేసిన రొట్టెలను తినే వారని తేలింది. ఆ పిండిలో వచ్చిన కల్తీ కారణంగా లేదా ఫంగస్ వల్ల ఇలా అందరికీ ఈ డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి వచ్చినట్టు భావించారు. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తేలలేదు.